బ్రహ్మజ్ఞానంపూర్వం జనకుడనే మహారాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు. యజ్ఞయాగాది క్రతవులు నిర్వహిస్తూ.. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాజుకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. విషయం అష్టావక్రుడనే మహర్షి రాజు దగ్గరికి వెళ్లాడు. ‘రాజా! నీకు నేను బ్రహ్మజ్ఞానం అనుగ్రహిస్తాను’ అన్నాడు అష్టావక్రుడు. సంతోషించిన రాజు ఒక షరతు విధించాడు. ‘నేను గుర్రం అధిరోహించే లోపు బ్రహ్మజ్ఞానం అనుభూతిలోకి తీసుకురావాల’ని కోరాడు. అందుకు సమ్మతించాడు అష్టావక్రుడు. కానీ, తనతో పాటు నిర్జన ప్రదేశానికి రావాలన్నాడు.

అందుకు రాజు సమ్మతించాడు. మంత్రి, సేనాధిపతి వెంటరాగా రాజు, అష్టావక్రుడు అడవికి బయల్దేరారు. అడవి సమీపించిన తర్వాత మంత్రిని, సేనాధిపతిని అక్కడే ఉండమని ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ‘రాజా! ఇక నీవు గుర్రం ఎక్కవచ్చు’ అన్నాడు అష్టావక్రుడు. గుర్రం ఎక్కడానికి ఉండే రికాబులో రాజు కాలు పెట్టగానే.. ‘మరి నా గురుదక్షిణ సంగతేమిటి?’ అన్నాడు అష్టావక్రుడు. రికాబులో కాలు పెట్టి నిల్చున్న రాజు.. గుర్రం ఎక్కడం ఆపేసి ‘ఏదడిగినా ఇస్తాను’ అన్నాడు. ‘అయితే నీ మనస్సు ఇచ్చేయ్‌!’ అన్నాడు అష్టావక్రుడు. ‘అలాగే’ అంటూ మనస్సు ఇచ్చేశాడు జనకుడు. మరుక్షణంలో ఏ చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు రాజు.

అష్టావక్రుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంత సమయం అయినా రాజు రాకపోయేసరికి మంత్రి, సేనాధిపతి అడవిలోనికి వెళ్లారు. కదలక, మెదలక గుర్రం ఎక్కుతున్నట్టు నిలబడి ఉన్న రాజును చూసి కంగారుపడ్డారు. ఇంతలో అష్టావక్రుడు మళ్లీ అక్కడికి వచ్చాడు. వెళ్లి రాజును స్పృశించాడు. అతడిలో చలనం కలిగింది. ‘రాజా! మనసు ఇవ్వమనగానే ఏదో వస్తువు ఇచ్చేసినట్టు ఇచ్చేశావు. ఒక పదార్థంలా మనసును త్యజించావు. అదే బ్రహ్మజ్ఞానం. నీకు కొత్తగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాల్సిన అవసరం లేదు’ అన్నాడు అష్టావక్రుడు. రాజు సంతోషించాడు. మనసును బహిర్ముఖంగా పోనీయకుండా అంతర్ముఖంగా ఆత్మలో లయం చేసి ఆత్మరూపుడై ప్రవర్తించడమే మోక్షం. అలాంటి స్థితిని మనిషి సాధించగలగాలి. అదే బ్రహ్మజ్ఞానం.


Share This :

Related Postsentiment_satisfied Emoticon