బుద్ధుని ప్రవచనం


 •  నందుడి రథం బుద్ధుని కుటీరం వైపుగా వెళుతోంది.బుద్ధుని కుటీరం సమీపంలో అనేకమంది కపిలవస్తు ప్రజలు బుద్ధుని చుట్టూ గుమిగూడారు.
 • తథాగతుని ఆశీర్వచనాల కోసం భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేస్తున్నారు.
 •  నందుడు దూరం నుండే బుద్ధుడ్ని చూసాడు. రథం దిగి వడి వడిగా అటువైపుగా వెళ్ళాడు. ప్రజల మధ్యనుండి బుద్ధుడు తన కుటీరం లోపలకి వెనుదిరిగాడు.
 •  పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బుద్ధుని అనుసరించాడు.నందుని రాకను బుద్ధుడు గమనించనట్లుగా ముందుకు నడుస్తున్నాడు.

 •   ఒక్క ఉదుటన నందుడు బుద్ధుని దాటి ముందుకెళ్ళి పాదాలపై మోకరిల్లాడు.
 •  మోకాళ్ళపై వంగి రెండు చేతులెత్తి నమస్కరించి గద్గద స్వరంతో, మరదలు ఇచ్చిన భిక్షని స్వీకరించమని ప్రాధేయ పడుతూ –
 •  ” ఓ సాధుశ్రేష్టుడా ! మా పై కటాక్షించి భిక్షకై మీరు రాజమందిరం రావడం గమనించనందుకు మా పొరపాటును క్షమించండి. నా తప్పుని తెలుసుకొని, స్వయంగా మిమ్మల్ని రాజమందిరం తోడ్కొని పోవడానికై విచ్చేసాను.
 •  నాపై కరుణించి మా ఆతిధ్యాన్ని స్వీకరించండి. అపరాహ్ణ వేళ కావస్తోంది. మేమిచ్చే భిక్షను స్వీకరించండి.” అంటూ పలికాడు.
 •  పశ్చాత్తాప భరితమైన నందుడి స్వరం విని ఒక్కసారి నందుడి కేసి చూసాడు బుద్ధుడు.
 •  ఈ వేళకి ఇక ఆహార కార్యక్రమం లేదన్నట్లుగా సంజ్ఞ చేసాడు.
 •  మంచిది అనుకుంటూ బయల్దేరాడానికి సిద్ధమయ్యాడు నందుడు.
 •  బయల్దేరేముందు బుద్ధుడికి పాదాభివందనం చేసి చేతులు జోడించాడు.
 •  మందస్మిత వదనంతో మౌనంగా బుద్ధుడు బిక్షాపాత్రని నందుడి చేతిలో ఉంచాడు.
 •  తేజోవంతమైన తధాగతుని చూపు నందుణ్ణి కట్టిపడేసింది.
 •  నిశ్చేష్టుడై మౌనంగా బుద్ధుని కేసి చూస్తూ ఉండిపోయాడు. అనుగ్రహార్థం శుభసూచికంగా బుద్ధుడు తన చేతిలో ఉంచిన భిక్షా పాత్రకేసి చూసాడు నందుడు.
 •  తన విషయం అర్థమయ్యింది.తనకోసం ఎదురుతెన్నులు చూసే తన నెచ్చెలి గుర్తుకొచ్చింది.
 • ప్రియురాలి వ్యామోహంతో పరాశ్రితుడైన నందుడి మనసులో విషయ వాసనల బీజం తొలగించాలని సంకల్పించాడు బుద్ధుడు.
 •  తన వెనుకనే రమ్మన్నట్లుగా చూపిస్తూ విహార వాటిక వైపుగా నడిచాడు బుద్ధుడు.
 • దుఖపూరితమైన వదనంతో నందుడు గతిలేనట్లుగా బుద్ధుణ్ణి అనుసరించాడు.
 • అప్పుడు బుద్ధుడు బాధాతప్తుడైన నందుడి కేసి ఓ లిప్త కాలం చూసి, చక్రాంతమైన హస్తాన్ని నందుడి శిరస్సుపై ఉంచాడు.
 • ఒక్కసారి నందుడి వళ్ళు జలదరించింది. ఏదో తెలియని అతీత శక్తి తననాక్రమించుకుందన్న విషయం ఇంకా అవగతం కాలేదు.
 •  దయాస్వరంతో బుద్ధుడు ఇలా అన్నాడు.
 • ” ఓ ప్రియనందనా ! దుఖ హేతువైన కాలం నిన్ను ఆక్రమించుకోక ముందే నీ మనస్సుని శాంతి మార్గం వైపు లగ్నం చేసుకో !
 • ఎందుకంటే ఈ జగత్తులో ప్రతీ ప్రాణినీ మృత్యువు కాలసర్పంలా కాటేయక మానదు. కనుక స్వప్న భరితమైన సుఖోపభోగాలనబడే విషయ వాసనల వైపు మొగ్గే మనస్సుని అదుపు చెయ్యి.
 • గాలి తాకిడికి కుదురులేని అగ్నిలా..  విషయవాసనలతో మనస్సు నిలకడ కోల్పోతుంది.
 • మనిషికి శ్రద్ధని మించిన ధనంలేనట్లుగానే సుఖాలలో అధ్యాత్మికత మించిన సుఖం లేదు.
 • అన్ని దుఖాలలో అవిద్యా రూపమైన జీవితం మించిన దుఖం మరొకటి లేదు.
 • ఇంద్రియార్థ పూరితమైన ఈ మనస్సుని సాధన చేత  స్వాధీన పరచుకో ! నీ మనస్సు నీకు లొంగి ఉండాలి కాని కోరికలకి బానిస అవ్వడం ఎంత అనుచిత్యమో ఆలోచించు.
 • ఈప్రాపంచిక సుఖాల గోడలు కూల్చి ముక్తి మార్గాన్ని చూడు.
 • ప్రేమ అనే బంధం లో చిక్కుకోకు. ఎంత చవిచూసినా ప్రేమ తృష్ణ తీరదు.
 • ప్రేమ, అనురాగం, వ్యామోహం – ఈ మూడూ లేని జీవితం అత్యంత సుఖప్రదాయమైనది.
 • ప్రియమైన వారి వియోగం తప్పదు. దుఖం ఆవరించక మానదు. ఇది అనివార్యం.
 • పాములుపట్టే వాడు చేతిలో పాముని చూసి భయపడనట్లుగా కోరికల సర్పాన్ని చూసి భయపడకూడదు.
 • ధ్యాన; యోగాభ్యాసము, తత్వజ్ఞానం ఉన్న మనిషి మృత్యువుని చూసి చలించడు.బాధపడడు.
 • కనుక ఈ సంసారం నుండి బంధ విముక్తుడివి కమ్మనమని ఈ దీవన ! ”
 •  దయాళువైన బుద్ధుని ప్రవచనాలు విని, బాధాతప్తుడైన మనస్సు తో నందుడు ‘ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది’ అన్నట్లుగా శిరస్సు వంచాడు.
 • మౌనమే అతని భాషగా మిగిలింది. అంతా లీలలా జరిగిపోతోంది. తను మాత్రం ఇక్కడా అడ్డు చెప్పలేకపోతున్నాడు.
 • అజ్ఞాన బంధ విముక్తుణ్ణి చేసే నిమిత్తమై నందుణ్ణి సన్యాస యోగ్యుడిగా తలచి ప్రేమపూర్వక హృదయుడై బుద్ధుడు పరివ్రాజక దీక్ష కై ఆనందుడనే ప్రియ శిష్యుణ్ణి ఆదేశించి వెళ్ళిపోయాడు.
 • ఆనందుడు తనని సమీపించగానే, తను సన్యాసం స్వీకరించను అని నందుడు తెగేసి చెప్పాడు.ఆనందుడు ఈ నందుడి అభిప్రాయాన్ని తధాగతునికి వెంటనే విన్నవించాడు.
 •  బుద్ధుడు విషయం తెలుసుకొని మరలా నందుణ్ణి కలుస్తాడు.
 •   ” ఓ నందనా ! వ్రతపాలనాముఖులైన మన సోదరులైన ఎంతో మంది రాజ కుటుబీకుల్ని చూసి కూడా నీ మనస్సు మారలేదా? విషయ వాంఛలనుండి బయటకు రాలేవా? సంసార సుఖాలు ఈ మృత్యువుకి అతీతం కావు.
 • మనస్సుని ఆవరించుకున్న కోరికలు వదిలి జ్ఞాన మార్గం వైపు మళ్ళించాలని అనిపించడంలేదా?
 • నాలుగు వైపులా నిప్పంటుకున్న గృహంలో నిద్రించే వ్యక్తిలా నువ్వు ఈ కోరికల జ్వాలని తప్పించుకోలేవా?
 •  "మూర్ఖత్వాన్ని మించిన మృత్యువు లేదు" "అజ్ఞానాన్ని మించిన దుఖం మరొకటి ఉండదు”

*బుద్ధుని ధర్మ ప్రవచనాలను విన్న నందుడి మనస్సు చలించింది*.
 • బుద్ధుడు సూటిగా నందుడి కళ్ళలోకి చూసాడు. ఆ ఒక్క చూపే నందుడ్ని మరోసారి కట్టిపడేసింది.
 •  బుద్ధుడ్ని కాదనే ధైర్యం కోల్పోయాడు నందుడు. తధాగతుని కాదనే స్థైర్యం లేక ఆ బోధనల ప్రభావానికి తలొగ్గాడు నందుడు.
 • “మీరు ఆశించినట్లుగానే జరుగుగాక!” అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు నందుడు.
 • తనలో మానసిక పరివర్తన వచ్చిందోలేదో నందుడికి తెలియదు. అయిష్టతని ప్రకటించే శక్తిని కోల్పోయింది అతని మనసు.
 • అనంతరం ఆనందుడు కేశఖండనాదికం ప్రారంభించాడు. అది జరుగుతుంటే నందుడి కన్నులు అశ్రుపూరితాలయ్యాయి.
 •  తన శరీరంపై ప్రేయసి రాసిన చందన చర్చితాలు చూసి అతను దుఖం ఆపుకోలేకపోయాడు.రాలిన కేశాల్లా  తన లోని కోరికలు బరువైన కన్నీళ్ళకి తలొగ్గి కేశాల్లా రాలిపోయాయి.
Share This :

Related Postsentiment_satisfied Emoticon