యోగమార్గము గురించి మీకు తెలుసా ??


యోగము:పార్వతీ ! ఇక యోగమార్గము గురించి వివరిస్తాను. ఈ దేహము, ఇంద్రియములు, మనసు, బుద్ధీ, ఆత్మ ఇవన్నీ ఒకటే కాని వేరు కాదు అనుకోవడమే యోగము. ప్రతిరోజూ అగ్నిహోత్రము చెయ్యడం, అధికంగా మాట్లాడకుండా ఉండడం, సత్వగుణము కలిగి ఉండడడం, అర్హులైన వారికి దానంచెయ్యడం, వేదాభ్యాసంచెయ్యడం, ఎల్లప్పుడూ శుచిగా ఉండడం, సత్యముపలకడం, వీటిని అనుసరించడం వలన మానవుడిలోని పాపాలునశిస్తాయి . శుచిగాశుభ్రంగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనముమీద కూర్చోవాలి. నడుము దగ్గర నుండి తల వరకు నిటారుగా కూర్చోవాలి. ఇంద్రియములను మనస్సును ఏకం చెయ్యాలి. మనస్సును ఆత్మలో లీనముచెయ్యాలి. ప్రాణ, ఆపాన వాయువులను క్రమబద్ధం చెయ్యాలి. మానవుడు మనసును ఈ దశకు రాగానే ఇష్టం వచ్చినట్లు పోనీయరాదు. ప్రాణవాయువు ఆపానవాయువుతో కూడి ఊర్ధ్వ ముఖంగా పయనించి శిరస్సు దగ్గరకు చేరుతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతుంది. ఈ యోగమును అనుసరించడానికి సోమరితనము, పరధ్యానము, అత్యాశ, ఇతరులపట్ల ఆదరం లేకపోవడం, రోగములు, స్వప్నములు, లోభత్వము, భయము, కామము, క్రోధము, సుఖములు అనుభవించాలన్న కోరిక, చంచలత్వము మొదలైన దుష్టగుణములు అత్యంత విరోధములు. పైన చెప్పిన గుణములు ఉన్నవారు యోగాభ్యాసానికి అర్హులు కారు. ఈ యోగాభ్యాసమును నిష్ఠతో చేసిన అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలడు. యోగి ఎక్కువగా నిద్ర పోకూడదు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండ కూడదు. ఎక్కువగా తిన కూడదు. అలాగని అసలు తినకుండా ఉండ కూడదు. మితభోజనం, మితనిద్ర యోగికి యోగసిద్ధి కలిగిస్తుంది. యోగధర్మము ఇదే అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon