తొలి ఏకాదశి నాడు ఉపవాస నియమం ఎందుకు చేయాలిఅందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ...

మహావిష్ణువుకు ప్రియమైన తొలి ఏకాదశి .................
04-07-2017 తొలి ఏకాదశి సందర్భంగా ................
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశిని పూర్వం ఉగాదిగా, నూతన సంవత్సర ఆరంభదినంగా పరిగణించేవారు. అందువల్ల దీనిని తొలి ఏకాదశిగా పిలుచుకున్నారని చరిత్ర చెబుతోంది. మన ప్రాంతంలో ‘‘తొలి ఏకాదశితో పండుగలన్నీ తోసుకు వస్తాయి’’ అనే నానుడి ఉంది. ఈ పండుగను పూర్వకాలం ఏరువాక వేడుకల్లో భాగంగా జరుపుకునేవారు.పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటిలోనూ రకరకాలపిండివంటలు చేసుకుని తినడం తెలిసిందే. ఏవి పడితే అవి అధికంగా భుజించడం వలన అనారోగ్యాలు కూడా వాటి వెన్నంటి వస్తాయి. అందుకే తొలి ఏకాదశినాడు లంఖణం చేయమంటారు. ‘లంఖణం పరమౌషధం’ అని ఆయుర్వేదం చెబుతోంది. దానినే మనం ‘ఉపవాసం’ అనే పదంతో పవిత్రంగా భావిస్తున్నాం. ఉపవాసదీక్షకు నాంది ‘తొలి ఏకాదశి’.
పురాణ నేపథ్యం...
ఆషాఢ మాసంలో ప్రత్యక్షనారాయణుడు అంటే సూర్యభగవానుడు తన మార్గాన్ని ఉత్తద దిక్కు నుంచి దక్షిణ దిక్కులోకి మార్చుకుంటాడు. ఈ పండుగ దాదాపు దక్షిణాయనం ప్రారంభం అయిన తరువాత మొదటి పండుగ. విష్ణుమూర్తి తన పనులకు కొద్దిగా విశ్రాంతినిస్తూ శయనిస్తాడు. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శేషువు పైన శయనించటానికి ప్రారంభించిన రోజు. అందుకనే ఈ రోజును తొలి ఏకాదశి అని, శయనైకాదశి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆది శేషువుపై యోగనిద్రకు ఉపక్రమించడం వలన శేషశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందువలన దశమి నాటి నుంచి ముక్కోటి దేవతలు ఆయనను అర్చిస్తారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు.
సాంఘిక అంశం...
ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే... భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.
పురాణం - సాంఘికం
విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.
Share This :

Related Postsentiment_satisfied Emoticon