ప్రారబ్ధ కర్మ నుండి తప్పించుకోలేమా?

ప్రారబ్ధ కర్మ నుండి తప్పించుకోలేమా?

మనం పొద్దుటినుండీ రాత్రి వరకు ఎప్పుడో ఒకసారి "నా ప్రారబ్ధం వల్లనే ఇదంతా జరుగుతోంది"  అని కానీ "నా ప్రారబ్ధం  కొద్దీ దొరికావు కదురా" అని అనుకోవడం వింటూనే ఉన్నాము. ప్రారబ్ధ కర్మ ఆంటే అసలు ఏమిటి?   దీని నుండి తప్పించుకోలేమా? 

కర్మ అన్న పదమే చిత్రమైనది. ఇది పూర్తిగా స్వయం కృతం.  మన చేతులారా చేసుకున్న కార్యాలే ఈ కర్మ. ఇది మన తలపై ఎవరో రుద్దింది కాదు. ఎవరో దేవుడో రాక్షసుడో ఈ కర్మలు మనకి విధించలేదు.  ఇది ప్రకృతి ధర్మం.  ఏ శక్తి నీవు వెలికి పంపిస్తే , అదే శక్తి నీకు తిరిగి వస్తుంది.  ఎంత కాలం లో తిరిగి వస్తుంది? ఎంత శక్తిమంతంగా తిరిగి వస్తుంది? అనే విషయాలను మరెన్నో అంశాలు నిర్ధారిస్తాయి.  ఒక పొలాన్ని రైతు సాగు చేయడానికి కొంత కాలం పడుతుంది.  ఈ కాలంలో అతడు ఎన్నో దుస్తులు మారుస్తాడు.  సాగు చేసే సమయం లో అతడు దుస్తులు ఎన్ని మార్చినా పంట అతడిదే కదా!  ఇదే కర్మ పునర్జన్మ సిద్ధాంత విషయంలో జరుగుతుంది. ఈ రోజు నీలం రంగు చొక్కా వేసుకుని ఒక అబ్బాయి నగ దొంగిలిస్తే, మర్నాడు అతడు మరో చొక్కా వేసుకున్నా దొంగ అతడే కదా!  చొక్కా కాదు కదా దొంగతనం చేసింది.  శిక్ష అతడికే.  మరో జన్మలో అతడు చేసిన పాప పుణ్యాల ఫలం అనుభవించడమే కర్మ సిద్ధాంతం.

ప్రతి మానవుడి వెనుక ఆది మానవుడిగా జన్మించిన నాటినుండీ కొన్ని వందల జన్మలు ఉన్నాయి.  ఈ జన్మలు అన్నింటి ఫలాలను కలిపి "సంచిత కర్మ" అంటారు.  ఈ మొత్తం కర్మని ఒకే జన్మలో అనుభవించడం కష్టం కాబట్టి కొంత పెద్ద పరిమాణంలో దుష్కర్మనీ
తక్కువ పరిమాణంలో సత్కర్మనీ ప్రసాదించి అతడి వర్తమాన జన్మ ప్రారంభింప చేస్తారు.  దీనిని ప్రారబ్ధ కర్మ అంటారు.  ఈ ఒక్క జన్మ లొనే అతడికి కొన్ని కర్మలు బంధాలు రుణాలు ప్రేమలు నిర్ధారించబడినయి.  దీనిని జ్యోతిష విద్వాంసులు జాతక చక్రం వేస్తారు.

ప్రారబ్ధ కర్మ మూడు విధాలు:
1. దృఢ కర్మ: ఇది వర్తమాన జీవితంలో అనివార్యంగా అనుభవించ వలసిన కర్మ.  తల్లి తండ్రి భార్య పిల్లలు ఉద్యోగజీవితం, కొన్ని గండాలు నిర్ధారించబడతాయి.  ఏ తల్లి తండ్రులకి జన్మించాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరు పిల్లలుగా పుట్టాలో వారే వస్తారు.  దీని నుండి తప్పించుకోవడం అసాధ్యం - కొన్ని విశేషమైన వ్యక్తులు, సందర్భాల్లో తప్ప.  జ్యోతిష పండితులు సాముద్రిక శాస్త్ర పండితులు చాలా ఖచ్చితం గా చెప్పగలుగుతారు.  ఇది పూర్వ నిర్ధారితం  కాబట్టి.
2. అదృఢ కర్మ: ఈ అదృఢ కర్మని వర్తమానం లోని ప్రస్తుత కర్మల ద్వారా జయించ వచ్చును.  కొన్ని సూచనలు అవకాశాలు కూడా భిన్న శాస్త్రాలు సూచిస్తాయి.  తెలివి తేటలతో  కృషితో ఈ అదృఢ కర్మలని జయించవచ్చును.  కొన్ని వ్యాధులని  సమయం కన్నా ముందే తగ్గించుకోవచ్చును.  అశ్రద్ధ, నిర్లక్ష్యం, అహంకారం తో పెంచుకోవచ్చును.  కొన్ని విజయాలు ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా  పొందవచ్చును.
3. దృడాదృఢ కర్మ: మానవ ప్రయత్నం 51 అయితే  అనుభవించి వలసిన  కర్మ 49 అవుతుంది.  మన ప్రయత్నం తగ్గి పోయి, "అంతా పై వాడే రాసేశాడు" అని అనుకోకుండా మానవ ప్రయత్నంతో అధిగమించాలి.  ఆ కర్మని పూర్తిగా అదృఢ కర్మ లా జయించలేక పోవచ్చు.  కానీ  దాని తీవ్రతని జయించ వచ్చును.

జీవితం లో వచ్చే వ్యాధులు, దురదృష్టాలు, కన్నీళ్లు, అవమానాలు కొన్ని నిర్ధారిత సమయం లోనే వస్తాయి.  వాటిని తలచుకుని దుఃఖ పడటం ప్రారబ్దం లో లేదు.  దీని వలన వర్తమానం లో చేయవలసిన కర్మ మానేసి, విషాదం లో కూరుకు పోయే దుష్కర్మ చేయడం వలన భవిష్యత్తులో వేదనకు గురి అయ్యే అవకాశం ఉంది.  ఇది అసలు లేని కర్మ.  మనస్సు నియంత్రించు కోలేక పోవడం అనవసరంగా వచ్చే కర్మ.

Share This :

Related Postsentiment_satisfied Emoticon