జీవుడు మరొక గర్భములో ఎలా ప్రవేశిస్తాడు ?


జీవుడు గర్భప్రవేశము:పార్వతీదేవి నాధా ! మరణానంతరము జీవుడు మరొక దేహములో ప్రవేశిస్తాడని అన్నారు కదా ! జీవుడు మరొక గర్భములో ఎలా ప్రవేశిస్తాడు ? అని అడిగింది. పరమశివుడు పార్వతీ ! స్త్రీపురుషుల కలయిక వలన స్త్రీ గర్భము ధరించినప్పుడు పిండము ఉత్పత్తి ఔతుంది. ఆ పిండములో జీవుడు ఉండి శిశువుగా పునర్జన్మ పొందుతాడు. జీవుడు స్త్రీ గర్భములో రూపుదిద్దు కోవడానికి దైవసహాయము తప్పని సరి. పార్వతీ ! నీకొక రహస్యము చెప్తాను. పూర్వము మానవులందరికీ పూర్వజన్మ స్మృతి ఉండేది. అందువలన మానవులందరూ తమనుతాము సంస్కరించుకుని పుణ్యకార్యములు చేసి స్వర్గలోక సుఖములు పొందుతూ ఉండే వారు. అందరూ స్వర్గములో ప్రవేశించడంతో స్వర్గములో తొక్కిసలాట అధికమైనది. వీరందరికీ స్వర్గసుఖములు కలింగించడం దేవతలకు శ్రమ కలిగించింది. దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమకష్టము చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు యోచించి మానవులకు ఉన్న పూర్వజన్మ స్మృతి తీసివేసి దాని స్థానంలో మానవులకు కోరికలు, కామము, మదము, మాత్సర్యము, మోహము, లోభము మొదలైన దుర్గుణములు కల్పించాడు. దాని ఫలితంగా మానవులకు కోరికలు ఎక్కువై ఆ కోరికలు తీరడానికి చెడ్డపనులు చేయడానికి సంకల్పించారు. ఆ కోరికలు తీరకపోతే కోపము వచ్చేది. ఆ కోపము కారణంగా మానవులు మరణానంతరం స్వర్గానికి వెళ్ళలేక పోయారు. కాని నరకానికి మానవుల రాక ఎక్కువైనది. నరకంలో తాకిడి తగ్గించడానికి బ్రహ్మదేవుడు ఒక ఉపాయము ఆలోచించి స్వర్గానికి నరకానికి సమానంగా మానవులు వెళ్ళే ఏర్పాటు చేసారు. మానవులకు స్వర్గము, నరకము వాటి స్థితిగతులు కేవలం శాస్త్రపరిజ్ఞానము వలననే తెలిసే ఏర్పాటు చేసాడు. కనుక స్వర్గ నరకాల పరిజ్ఞానము మానవులు వారికి వారుగా తెలుసుకునే శక్తినికోల్పోయారు అని పరమేశ్వరుడు చెప్పాడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon