యోగజీవనం


ఆత్మ, పరమాత్మల సమ్మేళనమే యోగం. అంటే, ఇంద్రియాల్ని వశపరచుకొని చిత్తాన్ని భగవంతుడితో లయం చేయడం. యోగ సాధనతో మానసిక శక్తులు ఏకీకృతమై పరమాత్మతో అనుసంధానమవుతాయి. చిత్తవృత్తిని నిరోధించేదే యోగం. ఆ సాధన ద్వారా సాధకుడు ఏకాగ్రత సాధించి, పరతత్వ సామీప్యాన్ని పొంది, మనోసీమలోనే సమస్త విశ్వాన్నీ దర్శిస్తాడని యోగసూత్రాలు చెబుతాయి.
జీవన యోగంలో అనేక ప్రధాన పార్శా్వలు ఉంటాయి. సాధకుడు తనను ఎదుటివారిలో దర్శించి, అద్వైత స్థితిని అందుకొంటాడు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడటంతో పాటు, సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అనంత అమేయ శక్తిని అతడు అవగాహన చేసుకొంటాడు. భూతదయ కలిగి ఉంటాడు. విశిష్టమైనది కాబట్టే- వర్తమానంలో ‘యోగ’ ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ యోగశాస్త్రాన్ని అనేకమంది ఔత్సాహికులు అనుసరిస్తున్నారు. అదే పరంపరలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించుకుంటున్నాం.
యోగ అనే ప్రక్రియ పలు వ్యాయామ సాధనల ఆధ్యాత్మిక స్వరూపం. మోక్ష సాధనకు ఉపకరించే పరంపరలో ధ్యానం, అంతర్వీక్షణ, పరమానంద ప్రాప్తి, ఏకాగ్ర చిత్తం ఉంటాయి. వాటి సమాహారానికి ‘యోగ’ ప్రధాన ప్రాతిపదిక. యోగ తత్వాన్ని సశాస్త్రీయంగా ఆవిష్కరించిన మహాయోగి పతంజలి. ఆ మహర్షి యోగసూత్రాన్ని క్రోడీకరించారని చెబుతారు.
సూత్రం అంటే, దారం. దానితో పుష్పాల్ని గుదిగుచ్చినట్లు- యోగ కుసుమాల్ని యోగశాస్త్రంలో పతంజలి సమ్మిళితం చేశారు. హఠయోగ ప్రదీపిక, శివ సంహితలు యోగ సూత్రాల్లో ప్రధాన భాగాలు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలు ఆ సూత్రాలకు ఆలంబనలు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగ దర్శనం ఒకటి. దానికి పతంజలి యోగ సూత్రాలే ముఖ్య భూమిక. అభ్యాస వైరాగ్య భావనలతో చిత్తాన్ని, కర్మల్ని నిరోధించడమే యోగ సాధన పరమ లక్ష్యం. దాన్ని సాధించే ప్రక్రియను ‘పతంజలి అష్టాంగ యోగం’ అంటారు.
పతంజలి యోగ సూత్రాలన్నీ నాలుగు అధ్యాయాలుగా సంకలనమయ్యాయి. సమాధి పద, సాధనా పద, విభూతి పద, కైవల్య పద అనే ఆ నాలుగు అధ్యాయాల్లో సమస్త యోగ తత్వాన్నీ పతంజలి వ్యక్తీకరించారు. మానసిక శుద్ధికి ఉపకరించే యోగాలుంటాయి. దేహ దారుఢ్యానికి, ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నిరోధానికి సహకరించే శారీరక ఆసనాలకుఅష్టాంగ యోగం సమగ్రమైన సాకారం కల్పిస్తుంది.
ఏకాగ్రతతో చిత్తాన్ని నిరోధించి, దుష్కర్మల్ని నిలువరించి, పరమానంద స్థితి సాధించడాన్ని ‘సమాధి పద’ అభివ్యక్తం చేస్తుంది. కర్మయోగాన్ని, రాజయోగాన్ని ఏ విధంగా సాధన చేయాలో ‘సాధనా పద’ వివరిస్తుంది. యోగ సాధనలో నైపుణ్యం, అవగాహన వంటివాటిని ‘విభూతి పద’ వెల్లడిస్తుంది. యోగసాధన ద్వారా మోక్ష సోపానాల్ని ఏ విధంగా అధిరోహించాలో ‘కైవల్య పద’ బోధపరుస్తుంది. యోగ శాస్త్రంలో అష్టాంగ యోగాలకూ కీలకపాత్ర ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి- అనేవి అష్టాంగ యోగాంశాలు.
అహింస, సత్యం, అపరిగ్రహం వంటి అంశాల్ని ‘యమ’ పేర్కొంటుంది. శౌచం, సంతోషం, స్వాధ్యాయనం, తపస్య, ఈశ్వర శరణాగతిని ‘నియమం’ విశదపరుస్తుంది. శారీరక శుద్ధికి ‘ఆసన’ తోడ్పడుతుంది. మానసిక స్థైర్యం పెంపొందింపజేయడానికి ‘ప్రాణాయామం’ దోహదపడుతుంది. ఇంద్రియాల అంతర్ముఖీనత్వాన్ని ‘ప్రత్యాహారం’ ప్రకటిస్తుంది. ఏకాగ్రత వృద్ధిక్రమాన్ని ‘ధారణ’ ఆవిష్కరిస్తుంది. చిత్తశుద్ధికి ‘ధ్యానం’ ఉపకరిస్తుంది. సాధనా పరిపూర్ణ స్థితికి ‘సమాధి’ ఓ మార్గదర్శనం చేస్తుంది.
యోగాతో శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత చేకూరతాయి. యోగాసనాల అభ్యాసం వల్ల కండరాలకు స్థితిస్థాపక శక్తి పెంపొందుతుంది. నరాలు, కీళ్లు సక్రమంగా పనిచేస్తాయి. యోగ సాధనతో రోగ నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. ఆసన, శయనాది రీతుల్లో సాధకులు యోగవిద్య అభ్యసించి ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.
సకారాత్మక భావనలు పెంపొందడానికి, వికారాత్మక భావజాలం దూరం కావడానికి యోగవిద్యే మూలాధారం. శారీరక, ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి ‘యోగ’ అవసరం
Share This :

Related Postsentiment_satisfied Emoticon