ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది.ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ప్రమాదం నడకలో మార్పు తీసుకువస్తుంది. ఒక అనుభవం జీవితం పట్ల దృక్పథాన్ని సవరిస్తుంది. ఆ అనుభవం మరణానుభవమైతే? ఈ ప్రశ్నకు రమణ మహర్షి జీవితమే సరైన సమాధానం!
రమణ మహర్షి అసలు పేరు తిరుచ్చుళి వేంకట రామన్‌. ఆయనది మధురై. 1896 జులైలో ఒక రాత్రిపూట అకస్మాత్తుగా ఆయనకు మరణభయం కలిగింది. అందరిలాగా బెంబేలు పడలేదు. తానే మరణ సమస్యను పరిశోధించాలనుకున్నారు. దాన్ని మానసికంగా అనుసరించారు. శ్వాసను బంధించి, కళ్లు మూసుకున్న ఆయన- మృతిని అనుకరించారు. తాను మరణించినట్లు వూహించారు. తన దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లడం, దహనం చేయడం, అది క్రమంగా కాలి బూడిద కావడం- ఈ క్రమాన్నంతటినీ రమణ మహర్షి భావన చేశారు.
ఆ సమయంలో ఒక అద్భుతం సంభవించింది. ‘శరీరం లేకున్నా నేను ఉన్నాను’ అనే పరమ సత్యం ఆయనకు స్ఫురించింది. ఆ నేను- ఈ దేహం కాదని, దానికన్నా భిన్నమైందని, దానికి మరణం ఉండదని తెలిసిపోయింది. దాంతో మరణభయం రమణ మహర్షి మనసు నుంచి తొలగిపోయింది. ‘సాక్షీభూత స్థితి’గా శాస్త్రాలు వివరించిన ఒకానొక స్థితి ఆయనకు అనుభవ పూర్వకంగా అవగతమైంది. ఆత్మస్థితి బోధపడింది.
నేరుగా అరుణాచలం చేరుకున్న ఆయన ఈశ్వర రూపం ముందు నిలిచారు. ‘అప్పా! నీ ఆజ్ఞ ప్రకారం నీ చెంతకు చేరుకున్నాను... ఇక నీ ఇష్టం’ అని సంపూర్ణ శరణాగతి చెందారు.
అరుణాచలేశ్వరుడి దర్శనం పిదప, ఆయన 40 రోజులపాటు తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు. మౌనం పాటించారు. ‘మౌన స్వామి’గా ప్రజలు ఆయనను పిలవడం మొదలైంది. ఆ దశలోనే తల్లి అళగమ్మ, సోదరుడు నాగసుందరం ఆయనకు శిష్యులయ్యారు. అనంతర కాలంలో సన్యాసం స్వీకరించి ‘నిరంజనానంద స్వామి’గా మారింది రమణ మహర్షి సోదరుడు నాగసుందరమే!
తెలుగు గడ్డలోని బొబ్బిలి ప్రాంతం కలువరాయికి చెందిన ఉపాసకులు కావ్యకంఠ గణపతి మునిని చూశాక, వేంకట రామన్‌ మౌనం వీడారు. ఆ ముని ఆయనకు ‘భగవాన్‌ శ్రీరమణ మహర్షి’గా నామకరణం చేశారు. ‘మాటలు ఆగితే, అది నిశ్శబ్దం. ఆ స్థితి- మనసులోని ఆలోచనలకు, సంకల్పాలకు సైతం ఏర్పడితే అది మౌనం’ అని రమణ మహర్షి బోధించారు. ‘మృత్యుభీతి తొలగిపోవడమే మృత్యువును జయించడం’ అని చాటారు. మోక్షం, ఆత్మ సాక్షాత్కారం, నిర్వాణం వంటి పదాలకు అదే అర్థమన్నారు. తాను పొందిన అనుభవాన్నే సాధన చేయించి- శిష్యులకు ఆత్మసాక్షాత్కార అనుభూతిని అనుగ్రహించారు. దానికి తల్లి అనుభవమే ఒక ఉదాహరణ.
అళగమ్మ చివరి ఘడియల్లో మౌనస్వామి ఆమె తలపై చేతులుంచి గంటల తరబడి ధ్యానం చేశారు. రానున్న జన్మల్లో ఆమె పూర్తిచేసుకోవాల్సిన కర్మపరిపాకాన్ని ఆ సమయంలో మానసికంగా అనుభవానికి తెచ్చారు. సంపూర్ణ కర్మ విమోచన ముగిసిన భావన అళగమ్మలో ఏర్పడింది. అది ఆమెను మోక్షస్థితికి చేర్చింది.
ఇది కేవలం చదివితేనో వింటేనో అవగతమయ్యేది కాదు. ఎవరినైతే బాధపెట్టామో వారి హృదయాల్లోకి ప్రవేశించి- ఆ వేదనను, అవమానభారాన్ని పూర్తిగా అనుభవించగలిగిననాడే అది బోధపడుతుంది. కర్మ విమోచన ప్రక్రియ అలవాటవుతుంది. ‘కర్మల నుంచి విముక్తులు కావడమే ముక్తి’ అని పెద్దలు చెప్పిన సత్యం అంతటా రుజువవుతుంది. ఎవరి స్వీయ అనుభవంతో వారు తమ జీవితం పట్ల దృక్పథాన్ని సరిదిద్దుకోవాలి. కారణజన్ముడిగా భావించే భగవాన్‌ రమణ మహర్షికి మానవాళి సమర్పించగల నివాళి అదే!


Share This :

Related Postsentiment_satisfied Emoticon