త్రికరణశుద్ధి


దైవభక్తి అంటే సర్వవ్యాపి అయిన పరమాత్మ పట్ల ప్రేమ ఉండడమే గాని విగ్రహాలను పూజించడం కాదు. ఈ ప్రపంచం ప్రాణికోటికి సుఖాన్ని కలిగించడానికి, భగవంతుని చేత ప్రసాదింపబడింది. సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా అనుభవింపచేసే అద్భుత శిక్షణా కేంద్రం ఈ ప్రపంచం. మృత్యువు భయంకరమైంది. దానిపట్ల ఎవరికీ ప్రేమ ఉండదు. మృత్యువుకు మృత్యువు పరమేశ్వరుడే కనుక మానవులు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. ఎప్పటిదాకా భగవంతుణ్ణి గురించి తెలుసుకోలేరో, అప్పటి దాకా మృత్యుముఖంలో ఉన్నట్లే. పుట్టి నశించే జగత్తు మృత్యువే. మృత్యువు మరణశీలం కలిగింది. అందుకే మృత్యోర్మా అమృతంగమయ అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.
జగత్తు అనురక్తి జనకమైంది. అది ప్రతిక్షణం మనల్ని ఆకర్షణకు లోను చేస్తుంది. మృత్యుముఖంలో పడేస్తుంది. దాన్ని అధిగమించాలంటే భక్తి ఒక్కటే మార్గం. మనం భగవంతుణ్ణి మనసా వాచా కర్మణా విశ్వసించాలి. మన కర్మలకు కర్తలం మనమే అయినా కర్మ ఫల ప్రదాత పరమేశ్వరుడేనని గుర్తించాలి. జడచేతన జగత్తులో అంతటా పరమేశ్వరుడే ఉన్నాడని తెలుసుకోవాలి. అంతరంగంలో మనం ఏం భావించినా, వాక్కుతో ఏం పలికినా, చేతులతో ఏం చేసినా అది గమనిస్తున్నవాడు పరమేశ్వరుడే అని భావించాలి. త్యాగబుద్ధితో మనకీ ప్రపంచ పదార్థాలను అందించిన పరమేశ్వరుని గొప్పతనాన్ని గుర్తించి, మనం కూడా త్యాగవంతులమై, తోటి జీవులకు సహకారులమై ఉండాలి. అప్పుడే భక్తి ఉన్నట్టు. మనం ప్రేమించే ప్రాణిలోనే కాక, ద్వేషించే ప్రాణిలోనూ భగవంతుడున్నాడని తెలుసుకోవాలి. ఎవడు చేయదగిన పనులు చేస్తారో వారంటే భగవంతునికిష్టం. భగవంతుడు తనకోసం ఏ కర్మా చేయడు. ఆయన చేసే కర్మలన్నీ విశ్వ కల్యాణార్థమే. ఐతే మనం చేసే కర్మలకు ఫలాలిచ్చే అధికారం అతనిదే. నిజానికి మన కర్మ ఫలాలను ఆశించేవాడు కాడు భగవంతుడు. కాని మనమే కర్మలను చేస్తూ వాటి ఫలాలను అతనికి అర్పించాలి. ఇదే నిజమైన భక్తి అంటే.
భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మఅని అందుకే అన్నారు పెద్దలు. భగవంతుని యందు భక్తి కలిగి ఉండడమంటే కొత్త కొత్త కోరికలతో తీరిక లేకుండా, తీర్థయాత్రలకు వెళ్లడం కాదు, తోడి ప్రాణుల పట్ల ప్రేమ గలిగి ఉండడం అత్యవసరం. అహింసావ్రతం, సత్యవ్రతం, బ్రహ్మచర్య వ్రతం, దానవ్రతం, నిష్కామ కర్మ యోగం మొదలైనవన్నీ భగవంతుని పట్ల మనం చూపే భక్తికి నిదర్శనాలు. కర్మఫలానుసారం మనమే కాదు, తోడి ప్రాణులు కూడా శరీరధారులయ్యాయి. నిజానికి ఆ శరీరాలనిచ్చింది పరమేశ్వరుడే. మళ్లీ లాక్కునేవాడు కూడా అతడే. కాబట్టి ఎవరికీ హాని తలపెట్టకుండా ఉండడమే మానవ ధర్మం. భక్తునికి ఉండాల్సిన పరమధర్మం. భక్తి అంటే జ్ఞానానికి విరుద్ధంగా నడుచుకోవడం కాదు. తెలుసుకొని ప్రవర్తించడమే భక్తి. త్రికరణశుద్ధిని బట్టి భగవంతుడు భక్తునికి వశమవుతాడు. ఆత్మశుద్ధి లేని ఆచారాలను, చిత్తశుద్ధి లేని పనులను భగవంతుడు మెచ్చడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon