శ్రీ మహాభారతము


*సభాపర్వం*

ద్వితీయాశ్వాసం

భాగము-4
 • రాజసూయయాగం ప్రారంభం అయింది. భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు " ధర్మరాజా ! స్నాతకుడు, ఋత్విజుడు ,భూతలేశుడు, సద్గురుడు, జ్ఞానసంపన్నుడు, అందరికీ ఇష్టుడు అయిన మహానుభావుని ఒకరిని పూజించు " అని అన్నాడు. 
 • ధర్మరాజు భీష్మునితో " పితామహా ! అటువంటి మహానుభావుడెవరో మీరే శెలవీయండి " అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇంక ఎవ్వరున్నారు ? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్ర పూజకు తగిన వాడు " అని ధర్మరాజుతో చెప్పాడు. 
 • తనమనసులో మాట చెప్పినందుకు ధర్మరాజు ఆనందపడి సహదేవుడు తెచ్చిన అర్ఘ్యపాద్యాలను శ్రీకృష్ణునకు సమర్పించాడు. ఇది చూసి శిశుపాలుడు సహించలేక పోయాడు. 
 • ధర్మరాజుని చూసి " ఓ ధర్మరాజా! ఈ సభలో ఎందరో మహారాజులు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని కాదని ఈ గాంగేయుడు చెప్పాడని చెడు నడవడి కలిగిన ఈ కృష్ణుని పూజిస్తావా ? ఇది అవివేకం కాదా ? ఈ భీష్మునికి ఆలోచనలేకపోతే నీ బుద్ధి ఏమైంది? మీకు కృష్ణుడు కావలసిన వాడైతే మీ ఇంటికి తీసుకు వెళ్ళి పూజలు చేయండి. ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించ కండి. కృష్ణుడు ఇంతటి మర్యాదకు అర్హుడు కాదు " అంటూ శిశుపాలుడు సభ విడిచి వెళ్ళాడు. 
 • ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి " శిశుపాలా ! నీ వంటి ప్రభువులు ఇలా పరుషంగా మాటాలాడ తగునా ? శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం కనుక భీష్ముడు అగ్రపూజ చేయమన్నాడు. 
 • లోకోత్తరుడని అందరిచే శ్లాిఘించబడే కృష్ణుని నువ్వు ఇలా కాదనడం భావ్యమా ? " అని శిశుపాలునికి నచ్చచెప్ప పోయాడు. భీష్ముడు " ధర్మరాజా ! శిశుపాలుడు బాలుడు, చెడు నడత కలిగిన వాడు. పెద్దలను అకారణంగా నిందించే వాడు. కొద్దిపాటి రాజ్యం లభించగానే మదం ఎక్కిన వాడు. వాడికి ధర్మాధర్మాలు తెలియవు. అతడిని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తావు ? " అని శిశుపాలుని చూసి " శిశుపాలా! బుద్ధిహీనుడా శ్రీకృష్ణునికి అగ్రపూజకు అర్హత లేదా ? ఇక్కడ ఉన్న రాజులంతా జరాసంధుని నుండి విడిపించింది ఈ మహానుభావుడే కదా.
 •  బాలుడైనా జ్ఞానవృద్ధుడు పూజనీయుడే. అమిత పరాక్రమవంతుడైన క్షత్రియుడు పూజనీయుడే. శ్రీకృష్ణుడు మహాజ్ఞాని, మురుడు అనే రాక్షసుని సంహరించిన పరాక్రమ వంతుడు. ఇతరులను పూజిస్తే వారు మాత్రం తృప్తి చెందుతారు. 
 • లోకారాద్యుడైన కృష్ణుని పూజిస్తే లోకమంతా తృప్తి చెందుతుంది " అన్నాడు. ఇంతలో సహదేవుడు లేచి " శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడం మా ఇష్టం . కాదన్న దుర్జనులను నా పాదం క్రింద అణిచివేస్తాను " అంటూ పాదం ఎత్తి భీకరంగా నిలబడ్డాడు. సభ అంతా సహదేవుని భీకరరూపంచూసి భయపడింది. శిశుపాలుని సైన్యాధిపతి తన సైన్యాన్ని తమపక్షాన ఉన్న రాజులందరిని ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధం అయ్యాయి. 
 • ఈ పరిణామానికి ధర్మరాజు కలత చెందాడు. భీష్ముని చూసి " పితామహా ! ఆహుతులైన రాజులంతా కలత చెంది ఉన్నారు. తమరే శాంతింప చేయాలి " అన్నాడు . భీష్ముడు " ధర్మజా! కలత పడకు. సకల రాక్షస సంహారుడు శ్రీకృష్ణుడు యాగరక్షకుడుగా ఉండగా ఈ యాగాన్ని ఎవరూ విఘ్నం చేయలేరు " అన్నాడు. 
 • ఆ మాటకు శిశుపాలుడు కోపించి " ఈ ముసలి భీష్ముడు యాదవుని పరమేశ్వరునిగా చేసాడు. ఈ పాండవువులు ధర్మాత్ములూ, ధీరులూ అయితే ఇక్కడున్న రాజులు అధర్మవర్తనులూ అధీరులా ? పూతన అనే స్త్రీని చంపుట, ప్రాణ రహితమైన బండిని తన్నుట, పుచ్చిన చెట్లను పడత్రోయుట, చిన్న పుట్టలాంటి కొండను ఎత్తుట పరాక్రమమా ? స్త్రీ వధ చేసినవాడికి మర్యాదలా ? అలాంటి వారిని పొగిడే వారిని సహస్ర చీలికలుగా చేయాలి. ఇక తమరి సంగతి మరొకరు ప్రేమించిన కన్యను తమ్ముడికి కట్టబెట్టాలని చూసావు. 
 • కాని ధర్మం తెలిసిన నీ తమ్ముడు అంబను విడిచి పెట్టాడు. సంతాన హీనుడివి నాకు ధర్మపన్నాలు చెప్తావా! ఈ కృష్ణుడు వీరత్వం తెలియనిదా. మహావీరుడైన జరాసంధునికి భయపడి పది సార్లు పారిపోయాడు. కపట బ్రాహ్మణవేషాలలో వెళ్ళి చంపడం వీరత్వమా ? " అని దూషించాడు. శ్రీకృష్ణుని తూలనాడటం సహించలేని భీముడు శిశుపాలుని చంపటానికి ముందుకు దూకాడు. భీష్ముడు భీముని ఆపాడు.

Share This :

Related Postsentiment_satisfied Emoticon