స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది


జీవాత్మ స్త్రీ పురుషులు:పార్వతీదేవి నాధా ! మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండు రకాలు ఉంటారు కదా ! స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది తెలియజెయ్యండి. పరమశివుడు పార్వతీ ! పుట్టడం స్త్రీగానూ, పురుషుడిగానూ పుట్టినా వారిలో ఉండే జీవాత్మ ఒక్కటే. దానికి స్త్రీ పురుష లింగభేదం లేదు. మనస్సు, బుద్ధి, హంకారము అందరికీ ఒక్కటే. అందరిలోనూ పంచభూతములు వాటి తన్మాత్రలు ఒక్కటే. మానవుడు చేసే కర్మలకు జీవాత్మ బాధ్యుడుకాడు. మానవుడు తనలోని సత్వ, రజో, తమోగుణ ప్రకోపముచేత పలువిధ కర్మలుచేస్తుంటాడు. జీవాత్మ ఆ కర్మలను సాక్షీభూతంగా చూస్తుంటాడు. సత్యము పలకడం, ఇతరులపట్ల దయకలిగి ఉండడం, ఎప్పుడూ మత్తులో జోగుతుండడం లేక నిద్రపోతూ ఉండడం ఇవన్నీ తామసగుణములు. సత్వగుణ ప్రధానుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. రజోగుణ ప్రధానుడికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. తమోగుణ ప్రధానుడు పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ముక్తి పొందుతాడు. ఈ సత్వ, రజో, తమో గుణముల కారణంగా కర్మలు చేసే వాడికి శుభములు, అశుభములు కలుగుతుంటాయి. ఒక్కోసారి దానికి భిన్నంగా కూడా జరుగుతుంటుంది. అధికారులు సేవకులను తిట్టి పనిచేయించుకోవడం పాపము కాదు, వైద్యుడు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడుతాడు అది పాపముకాదు. గురువు విద్యార్ధిని దండించి విద్యాబోధ చేసాడు. అది పాపము కాదు. అవి సుకృతములే కనుక సుకృత ఫలితమే వారికి వస్తుంది. జీవులు గర్భము నుండి, గుడ్డు నుండి, చెమట నుండి జన్మిస్తుంటాయి. వీటికి అన్ని ఇంద్రియములు ఉంటాయి. కాని విత్తనముల నుండి పుట్టిన చెట్లకు స్పర్శ జ్ఞానము మాత్రము ఉంటుంది. గర్భము నుండి పుట్టిన జీవులలో మానవుడు గొప్పవాడు. అతడికి ధర్మాధర్మవిచక్షణ, మంచిచెడుల విచక్షణ ఉంటాయి. ఈ జ్ఞానము లేనియడల అతడు పశువుతో సమానము. చీకటి రెండు విధములు రాత్రివేళ అలముకునే ఒకటి చీకటి. రెండవది అజ్ఞానము వలన కలిగే అంధకారము. మొదటి చీకటి వెలుగు రాగానే అంతరిస్తుంది. మనిషిలో అలముకున్న చీకటిని విద్యవలన శాస్త్ర విజ్ఞానమువలన నశిస్తుంది. మానవులలో పుట్టిన చీకటిని పారద్రోలడానికి బ్రహ్మ వేదములు, శాస్త్రములు సృష్టించాడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చెయ్యడం వలన ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. దాని వలన అజ్ఞానము చీకట్లు తొలగి పోతాయి. కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన గుణములు శాస్త్రాధ్యయనం వలన నశిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అలాంటి వాడు కొంచం పుణ్యము చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. శాస్త్రజ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారంలో మునిగిన వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అతడికి లభించే ఫలము తక్కువే అన్నాడు శివుడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon