అసలు పాపమంటే ఏమిటి ?పుణ్యకార్యముల అంటే ఏమిటి ?


పాపములు:పార్వతీదేవి నాధా ! మీరు పాపములు అని చెప్పారు కదా ! అసలు పాపమంటే ఏమిటి ? అని అడిగింది. పరమేశ్వరుడు పార్వతీ ! మానవుడు మూడు విధములైన పాపములు చేస్తాడు. అవి మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరంతో చేస్తాడు. ఇతరులకు ధనం ఉందే అని ఏడుస్తూ వాటిని అపహరించాలని అనుకోవడము, తన ఎదుటగా చెడ్డ పనులు, చెయ్య కూడని పనులు జరుగుతుంటే చూసి ఆనందించడమూ అడ్డు చెప్పక పోవడం, ధర్మకార్యములు, దైవ కార్యములు చేసే వాడికి అడ్డు దగలడం, చెయ్యనీయకుండా ఆపడం ఇవన్నీ మనసుతో చేసే పాపములు. అబద్దాలు చెప్పడం, ఇతరులను తిట్టడం, కఠోరంగా మాట్లాడడం ఇవి వాక్కుతో చేసే పాపములు. ఇతరులను కొట్టడం, చంపడం, అక్రమంగా బంధించడం, అడ్డమైన తిండులు తినడం, మధ్యం త్రాగడం. పరాయి స్త్రీలను చెరపట్టుట, అనుభవించడం ఇవి శరీరంతో చేసే పాపములు. ఈ పాపాలన్నింటికీ మద్యపానం మహా పాపము. దీని వలన ఎన్నో అనర్ధాలు కలుగుతాయి. ఇలా మానవులు పాపకూపంలోకి పోతుంటారు అన్నాడు.
పుణ్యములు:పార్వతీదేవి నాధా ! పాపములగురించి చెప్పారు మరి పుణ్యకార్యముల అంటే ఏమిటి ? అవి ఎలాఉంటాయి ? అని అడిగింది. పరమశివుడు పార్వతీ ! పుణ్యలు కూడా మూడు రకాలు. ఔపరమికము, నిరుపకరణము, సోపకరణము అని మూడు విధములు.
ఔపకరణము:ఔపరిమికము అంటే పాపములు చెయ్యకుండా ఉండడం. పాపకార్యములను విడిచిపెట్టుట. వాటి జోలికిపోకుండా ఉండడం. ఈ పని చెయ్యడానికి ధనము అవసరము లేదు. మనసులో అనుకుంటే చాలు. అన్నీ సుఖాలే కలుగుతాయి. చెడ్డపనులు చెయ్యకుండా ఉండడం మన చేతిలోపని. అదీ చెయ్యక పోతే నరకానికి పోక తప్పదు. చెడ్డ పనులను చెయ్యడం మానిన తరువాత వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి అర్ధము చేసుకొని ఆచరించాలి. ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. దీనివలన ఈ లోకములో సుఖములు అనుభవించవచ్చు పరలోకములో స్వర్గసుఖములను అనుభవించ వచ్చు.
నిరుపకరణము:నిరుపకరణము అంటే శౌచము అంటే శుభ్రముగా ఉండడం. అంటే కేవలం శుభ్రంగా ఉంటే చాలదు. మనసు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. అబద్దాలు చెప్పకూడదు. శాంతంగా ఉండాలి. ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. మంచి ప్రవర్తనతో మెలగాలి. శక్తిమేరకు ఉపవాసాలు చేయాలి. శక్తి కొద్ది వ్రతములు ఆచరించాలి. బ్రహ్మచర్యము పాటించాలి. దీనిని నిరుపకరణము అంటారు. మొదట చెప్పిన శౌచము బాహ్యము, అభ్యంతరము అని రెండు రకములు. బాహ్యశుచి అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తినే ఆహారము పరిశుభ్రంగా ఉండాలి. కంటితో చూసింది, చెవులతో విన్నది బయటకు చెప్పాలి. చెప్పింది చేయాలి. అంటే ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. అభ్యంతరం అంటే మనసును ఎలాంటి వికారాలకు లోను కాకుండా నిర్మలంగా ఉంచుకోవాలి.
స్నానములు:దేవీ ! పుణ్య నదులలో స్నానము చేస్తే దేహం పవిత్రమౌతుంది. సముద్రములలో కలిసే నదులను తీర్ధములు అంటారు. తీర్ధములలో స్నానము చేసిన పుణ్యము వస్తుంది. ఈ నదులలో కూడా మునీశ్వరులు తమతమ పాదములు మోపిన ప్రదేశములు పరమ పవిత్రమైనవి. అలాగే నదులు సముద్రములలో కలిసే సంగమ ప్రదేశములు పరమపవిత్రములైనవి. ఈ పుణ్య తీర్ధములలో స్నానము చేసే ముందు కాలకృత్యములు తీర్చుకోవాలి. శుభ్రంగా స్నానం చెయ్యాలి. ఎల్లప్పుడూ దూరంగా ఉండి శ్రమతో కూడిన తీర్ధయాత్ర మంచిది. దగ్గరలో ఉన్న తీర్ధములలో స్నానం ఫలితం ఇవ్వదు.
సోపకరణము:పార్వతీ పుణ్యములలో మూడవది సోపకరణము. ధనము, ధాన్యము సమృద్ధిగా ఉండి దానధర్మములు, పితృకార్యములు, దేవకార్యములు చేయు గృహస్థులు చేయు పుణ్య కార్యములను సోపకరణము అంటారు. గృహస్థులు తాము న్యాయంగా సంపాదించినధనము, ధాన్యమును వేదములు చదువుకున్న బ్రాహ్మణులకు పుణ్యతీర్ధములందు దానము చెయ్యడం వలన పుణ్యమువస్తుంది. ఈ దానములు కూడా మూడురకములు. తన శక్తికి మించి దానధర్మములు చెయ్యడం ఉత్తమము, తన శక్తికి తగినట్లు దానధర్మములు చెయ్యడం మధ్యమము. తనకు శక్తి ఉండి కూడా దానికి తగినట్లు దానధర్మము చెయ్యక పోవడం అధమం. దానములు దేవ కార్యములలో పితృకార్యములలో చెయ్యతగినవి. తనకు ఇష్టమైన వస్తువులను బ్రాహ్మణులకు ఇవ్వడంవలన పుణ్యం వస్తుంది. కొంత మంది దానము చేసిన తరువాత అయ్యో ఇంత దానముచేసానే అని చింతించే వారు ఉంటారు. అలాగే దానము చేసిన తరువాత తాను చేసిన దానమును పొగుడుకునే వారు, పొగిడించుకునే వాళ్ళు, ప్రచారము చేసే వాళ్ళు ఉంటారు. వారికి ఆదానము చేసిన ఫలము దక్కదు. గుప్తదానము శ్రేష్ఠమైనది అని పరమశివుడు చెప్పాడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon