సప్తర్షులులో ఒకరైన అత్రి మహర్షి ని గురించి తెలుసుకుందాము.


ఆత్రేయస గోత్రోద్భవులకు మూలపురుషుడూ, సప్తఋషులలో మొదటివాడూ అయిన అత్రిమహాముని,బ్రహ్మమానసపుత్రుడిగా బ్రహ్మ యొక్క దక్షిణ నేత్రమునుండి సృష్టి కార్యమునందు బ్రహ్మకు సహాయకారిగా సృజించబడ్డాడు. ‘అ’ కారము పురుషుని (విష్ణువు) యందూ, ‘త్రి’ కారము త్రిగుణాత్మకమైన ప్రకృతి యందూ వర్తింపచేసి, ప్రకృతిపురుషులయందు సమభావము కలిగినవాడై ఉండడంవల్ల ‘అత్రి’ అనే పేరు సార్థకనామం చేసుకున్నాడు.
బ్రహ్మ యొక్క ఆజ్ఞ చేత తపోదీక్షలో ఉండి ఆత్మానంద స్థితిని సాధించి, దేవహూతి, కర్దమమునిల కుమార్తె అయిన అనసూయను వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాడు. పరమసాధ్వి అయిన అనసూయ భర్తకు తగిన ఇల్లాలే. ఆయన తపోదీక్షలో ఉన్న సమయమున ఆయన నేత్రగోళముల తేజస్సు నుండి చంద్రుడు ఉదయించెను. ధర్మరక్షణ పరాయణార్థం హరిహరబ్రహ్మల ఆధ్యాత్మిక శక్తిచే ఒక కుమారుడు జన్మించాలనే అత్రి మహర్షి సంకల్పానికి అనుగుణంగా, త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్య మహిమని పరీక్షించదలచి, అతిధులుగా వచ్చారు. ఆమెను వివస్త్రయై తమకు భోజనం వడ్డించవలసిందిగా కోరారు. ఆమెయు భర్తకు మనసులో నమస్కరించి, వారిని తన పాతివ్రత్య మహిమతో పసిపాపలుగా మార్చి, వారుకోరినట్లే చేసెను. తరువాత వాణి, రమా, ఉమలు అక్కడికి వచ్చి తమకు పతిభిక్ష ప్రసాదించమని అత్రి మహర్షిని ప్రార్థించగా, భర్త అనుజ్ఞని పొందిన అనసూయ, త్రిమూర్తులని తిరిగి మామూలుగా చేసెను. ఆమె పాతివ్రత్య మహిమకు సంతోషించిన త్రిమూర్తులు తమ అంశలతో వారికొక బాలుడు జన్మించునట్లుగా వరమివ్వగా, ఆ వరప్రభావంచేత అత్రి అనసూయలకు మూడు ముఖాలతో దత్తాత్రేయుడు ఉద్భవించెను. ఆయన తన యోగబలంతో రాక్షసులను సంహరించి, ధర్మ రక్షణ గావించెను. 
ఇంకొక సారి సుమతి అను పతివ్రత శాపం వల్ల సూర్యోదయం కాకపోవుటచే లోకాలన్నీ తల్లడిల్లి, అత్రిమహర్షిని ప్రార్థించగా ఆయన ఆనతినొంది, అనసూయ తన తపశ్శక్తిచే, పాతివ్రత్య మహిమచే సూర్యుడు తిరిగి ఉదయించునట్లు చేయగా, లోకాలన్నీ శాంతించాయి. ఈ సంఘటనల వల్ల అనసూయాదేవి పాతివ్రత్య మహిమే లోకంలోప్రసిద్ధి చెందినా, పతి ఆజ్ఞ లేనిదే ఆమె ఎట్టి పనీ చేయదు కదా మరియు ఆయన మనస్సు గ్రహించియే చేస్తుంది కదా! అత్రి మహర్షిది ఈశ్వరశక్తి, అనసూయది ప్రకృతిశక్తి. ఈశ్వర, ప్రకృతి శక్తుల కలయికమాత్రం చేతనే సర్వధర్మపరిరక్షణ జరుగుతుంది కదా! దీనివలన ఆయన లోకహితానురక్తి, ధర్మరక్షణాసక్తి మనకు తెలియవస్తుంది.
ఒకసారి హైహయ రాజులు అనసూయా గర్భమందున్న పిండాన్ని బాధించుచుండగా, అత్రిమహర్షి రుద్రానువాకాలు పఠిస్తూ, తన తపోబలంచే ఆ గర్భస్థ పిండమునకు శత్రుసంహార శక్తిని కలిగించాడు. అప్పుడు ఆ పిండము తత్క్షణమే బయటికి వచ్చి, హైహయ రాజులను నాశనము చేసెను. ఆ శిశువే దూర్వాసమహర్షియై ప్రసిద్ధి చెందెను. వీరు ముగ్గురే కాక అనేకమంది మహనీయులకు అత్రి మహర్షి జన్మనిచ్చాడు.
ఒకానొకప్పుడు 12 సంవత్సరాలు క్షామం ఏర్పడింది. మునులు, ఆశ్రమవాసులు అందరూ అన్నపానీయాలు లేక అలమటిస్తూ అత్రి మహర్షి వద్దకు వచ్చి ప్రార్థించగా, జాలితో ఆయన రాల్చిన కన్నీరే అక్షయమై, అవి అమృతసమానమైన జలధారలై వారి దాహం తీర్చెను. అప్పుడాయన తన భార్య అనసూయతో అరణ్యములో దొరకు దుంపలతో వారి ఆకలి తీర్చమని చెప్పెను. ఆయన తపోబలం వల్ల ఆమెకు కావలసినన్ని దుంపలు దొరికాయి. అప్పుడు అందరూ అత్రి, అనసూయల దయను వేనోళ్ళ పొగిడారు.
గౌతమ మహర్షిచే తీసుకురాబడిన గంగ యందొక శాఖను తీసుకుని సముద్రముతో సంగమింపజేసి, ఆ నదీతీరమందే భార్యతో సహా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలోనే ధర్మసూత్రాలతో ఒక సంహిత రచించి అత్రి సంహితమను పేర శిష్యులచే లోకంలో వ్యాపింపచేసారు.
దశరథతనయుడైన రాముడు భార్యతోనూ, తమ్ముడితోనూ, అరణ్యవాసానికి వెళ్తూ, తన ఆశ్రమానికి రాగా, రాముని అరణ్యవాసంలో గల అంతరార్థాన్ని చెప్పి, సాధుమునిజనులను రక్షించవలసిన కర్తవ్యాన్ని చెప్పెను. అనసూయ కూడా సీతామాతను ఆశీర్వదించి, ఆమెకు అంగరాగాలు మొదలైన భూషణములనిచ్చెను. పృధుచక్రవర్తి చేయుచున్న అశ్వమేధ యాగంలో ఆయన కుమారుడికి సహాయంగా వెళ్లి, తన యోగబలంతో పృధు కుమారుడు ఇంద్రుని జయించునట్లు మరియు యాగం దిగ్విజయంగా పూర్తి అగునట్లు చేసెను. రాక్షసుల వల్ల అపహరింప బడిన సూర్యచంద్రులను తిరిగి తన తపోబలంతో రక్షించెను.
ఇలా ఎన్నోసార్లు తన తపోబలంతో, దయాగుణంతో, ప్రశాంతచిత్తముతో, కోపము నిగ్రహించుకొను సామర్ధ్యముతో, లోకహితకాంక్ష,విద్యాప్రబోధన శక్తితో జగత్కళ్యాణానికి కారకుడైనందువల్ల, ఈ అత్రి మహర్షిని సప్తర్షిమండలమున ఈ వైవస్వత మన్వంతరము వరకు వసించునట్లు, ఆ తర్వాత అంతకంటే అధికమైన స్థానానికి చేరాలని ఆనతిచ్చి, బ్రహ్మ ఆయనను ఋషి మండలమున ప్రవేశపెట్టెను. ఆ విధంగా అత్రి మహర్షి సప్తర్షిమండలమున ప్రకాశిస్తూ, మనకు పూజనీయుడైనాడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon