'సాంఖ్యయోగము' సంసారము అనే జబ్బుకు మంచి మందు


సాంఖ్యము:పార్వతీ ! ఇప్పుడు నీకు సాంఖ్యము గురించి చెప్తాను. ఈ సాంఖ్యయోగము సంసారము అనే జబ్బుకు మంచి మందు. సాంఖ్య యోగులు జ్ఞాన సముపార్జనతో ముక్తి చెందుతారు. కాని ఈ శరీరముతో తపస్సు చేయడ, శరీరాన్ని సుష్కించచేయడం వృధా ప్రయాశ. కేవలం జ్ఞానము వలనే మోక్షం పొందగలము. ఈ ప్రకృతికి అవ్యక్తము అనే పేరు కూడా ఉంది. ఈ ప్రకృతిలో నుండి మహత్తత్వము, అహంకారము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, వాటి గుణములు, ఆవిర్భవించాయి. ఇవి అన్నీ కలిపి 24. 25వ తత్వము ఆత్మ. ఈ ఆత్మ సత్వ, రజొ తమో గుణముతో ప్రభావితం ఔతుంది. వీటి ఆధారంతో ప్రకృతిలో సృష్టి జరుగుతుంది. అవ్యక్తమైన ప్రకృతి ఏక అణువు. అనగా అణువు ఒక్కటే అవిచ్చిన్నము. కంటికి కనపడదు. ఇదే సృష్టికి ప్రధానము.
త్రిగుణములు:సౌఖ్యము, తృప్తి, ప్రకాశము సత్వగుణ లక్షణములు. సుఖదుఃఖాలు, రాగద్వేషములు, మొదలగు ద్వందములు రజోగుణ లక్షణములు. అజ్ఞానము, భయము, అంతా తనకు తెలుసు అనే భ్రాంతి, విపరీతమైన జ్ఞానము కలిగి ఉండడం, ఏ పనీ చెయ్యకపోవడం, అలసత్వము ఇవి తమోగుణ లక్షణములు. సత్వగుణము ప్రధానంగా కలవాడికి, ధైర్యము, విజ్ఞానము, శ్రద్ధ, దేని మీద మోహము లేకపోవడము, ఇతరుల పట్ల దయ, ఎప్పుడూ సంతోషంగా ఉండడం అనేవి ప్రధాన గుణములు. ఈ గుణములు లేకపోతే సత్వగుణము కూడా నశించి పోతుంది. కోపము, లోభము, కామము, ద్రోహచింతన, దుఃఖము ఇవి రజోగుణ గుణములు. ఈ గుణములు విడిచిపెడితే రజోగుణము నశించిపోతుందు. ఎల్లప్పుడూ ప్రతిదానికి సంశయించడము, విషాదము, జడత్వము ఇవి తమోగుణ లక్షణములు. ఈ గుణములు తగ్గించుకుంటే తమోగుణము నశించి పోతుంది. ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ఒక్కటి ఎక్కువైతే మిగిలినవి తగ్గుముఖం పడతాయి. రెండు ఎక్కువగా ఉంటే మిగిలినది తగ్గుముఖం పడుతుంది. సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. సదా సంతోషంగా ఉంటాడు. రజోగుణము ఎక్కువగా ఉన్న మనుషి ఎప్పుడూ కోపంగా ఉంటాడు. సదా దుఃఖిస్తుంటాడు. తమోగుణము అధికంగా ఉంటే కామము, కోరికలు, సకలము అన్నీ తనకు కావాలని అనుకొని అవి దక్కక పోతే జితేంద్రియుడు ఔతాడు. ఈ గుణముల ప్రభావంతో చేసేపనుల వలననే మానవులకు దేవలోకప్రాప్తి మనుష్యలోకములో పుట్టడం లేక జంతువులలో పశుపక్ష్యాదులలో పుట్టడం జరుగుతూ ఉంటుంది. మహతత్వమును బుద్ధి అనికూడా అంటాము. ఈ బుద్ధి వివేకముకు, జ్ఞాననముకు గుర్తు. ఈ బుద్ధి వివేకముకు జ్ఞానముకు గుర్తు. అహంకారము సృష్టికి మూలము. అహంకారము వదిలితే ముక్తి దానంతట అదే వస్తుంది. ఇక మనస్సు ఇది ఇంద్రియముల ద్వారా ప్రకృతిలో సంచరిస్తుంటుంది. ఇంద్రియలోతత్వమునకు, ఇంద్రియనిగ్రహముకు ఈ మనసే కారణము. ఈ శరీరము పంచభూతముల గుణములైన శబ్ద, స్పర్శ, రస, గంధ రూపములు ఈ శరీరము ద్వారా ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ దేహము ఆత్మ కాదు, ఆత్మ కంటే వేరైనది. జీవాత్మ ఈ శరీరంలో అవ్యక్తంగా ప్రకాశిస్తున్నాడు. కాని మానవులు తామే ఆత్మ అనే అజ్ఞానంలో ఉంటాడు. అన్నీతామే చేస్తున్నామని, తమవలనే అన్నీ జరుగుతున్నాయని భ్రమపడుతుంటారు. తాను వేరు మనసు వేరు అనుకుని మనసును ప్రకృతి నుండి పరమాత్మ వైపు మళ్ళించిన మానవుడు ముక్తి పొందుతాడు. దేహాభిమానము పూర్తిగా నశిస్తేగాని ఇది సాధ్యము కాదు. ఈ తత్వమే 25వ తత్వము ప్రకృతిని వదిలి పెట్టి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విజ్ఞానము పరమ శాంతిప్రథము. అన్నింటికీ అధిష్టానం అయినది 26వ తత్వము. దానికి ఈ శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు అంటవు. ఇది నిత్యము, శాశ్వతము, అవ్యయము. అన్నింటిలోను ఉంటుంది. సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అతి సూక్ష్మమైనది. అత్యంత విశాలమైనది, ఇంద్రియములకు గోచరము కాదు. ఇదే 26వ తత్వము. ఆ తత్వమును పరమాత్మ అని పిలుస్తారు. ఇదే మోక్షపదము. సమదృష్టి కలిగిన వారు మోక్షముకు అర్హులు. పార్వతీ నీకు చెప్పిన ఈ సాంఖ్యము కపిల మహర్షి సేవించిన ధర్మము.
Share This :

Related Postsentiment_satisfied Emoticon