తపస్సు చేస్తే పూర్వ జన్మ విశేషాలు తెలుస్తాయా?


ఇటువంటి ప్రశ్న ఎవరు వేసారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చదువరులకు ఇప్పటికే తెలుసు కానీ జవాబు మాత్రం అవధరించండి.
తపస్సు అంటే ఒక కార్యసాధన కోసం తపించడం. అది ఆధ్యాత్మికం కావచ్చు, శారీరక, మానసిక, వాచక తపస్సులు కావచ్చును. యక్ష ప్రశ్నలలో ఒకటైన ఈ ప్రశ్నకు ధర్మరాజు తన వృత్తి, కులధర్మం ఆచరించడం తపస్సు అని అంటాడు. మనసా, వాచా కర్మణా చేస్తున్న పని మీద శ్రద్ధ కనబరచడం తపస్సు. అది చిన్నప్పుడు మనం చదువు గురించి తపించడం కావచ్చు, పెద్దయ్యాక కావలసిన కామ్యం కొరకు తీవ్ర పరివేదన పొంది మన శక్తులన్నీ ఆ పని మీద కేంద్రీకరించి ప్రయత్నించడం. మనోవాక్కాయ కర్మలందు ఆధ్యాత్మిక చింతన చేస్తూ భగవంతుని గురించి తీవ్రంగా తపించడమే తపస్సు అవుతుంది.
కొంచెం మనకు అర్ధమయ్యే చిన్న చిన్న పదాలలో ఈ విషయం మరికొంత చర్చిద్దాము. నేడు నీవు పొద్దున్న ఏమి చేసావు అంటే ఠక్కున చెప్పగలము. ఎందుకంటె అది మన మెమరీబ్యాంకు లో పైన దొరికే డేటా లాంటిది. ఒక మూడు రోజుల క్రితం ఈ సమయంలో ఏమి జరిగింది అని అడిగితే వెంటనే స్ఫురించదు. కానీ ఒక్క నిముషం మౌనాన్ని ఆశ్రయించి కొంత అంతర్ముఖులైతే ఆ సమాధానం దొరుకుతుంది. అదే ఒక నెల క్రితం జరిగిన విషయం అడిగితె మరికొంత ప్రయత్నం, మరికొంత అంతర్మధనం ద్వారా ఆ విషయం స్ఫురణకు వస్తుంది. మన మనస్సు ఇలా ఒకొక్క గదిలో ఒకొక్క విషయాన్ని భద్రపరచి మెమరీ లో వెనక్కు తోసేస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలంటే పక్క వారిని అడిగితే తెలియకపోవచ్చు. కానీ ఆ సమాధానం మనలోనే ఉంది, కావలసినది కొంత తపస్సు. మన మనస్సు ఎన్నో విషయాలను మన ఇంద్రియాల ద్వారా మనకున్న అవగాహన రీత్యా గ్రహించి జాగ్రత్తగా భద్రపరుస్తుంది. మనకొచ్చిన కోరికలు కొన్ని బయట పెట్టనివి కల రూపంలో వాటిని మనకు నటింప చేసి రంజింపచేస్తుంది. ఇలా ఎన్నో ఎన్నో విషయాలను జాగ్రత్తగా తెరచి చదివి తీసి పారెయ్యడం (access and delete ) ధ్యానం చెయ్యడం వలన మొట్ట మొదటి లాభం. ఇలా మన మనస్సులో ఉన్న చెత్త తుడిచిపెట్టుకుపోగా మరింత ప్రశాంతమవుతుంది. ఇలా చెయ్యగా చెయ్యగా మనలోని ఎప్పటినుండో నిక్షిప్తమైన విషయాలనుండి విముక్తి పొందుతాము.
ఒకరాత్రి కళ్ళు మూసుకుని తరువాత పొద్దున్న ఈ దేహంతో లేవడం నిద్ర. ఒక శరీరంలో కన్ను మూసి, మరొక శరీరంతో కన్ను తెరవడం పునర్జన్మ. ఒకే శరీరంతో అనుభవించిన విషయాలు తరువాత రోజుకు గుర్తుంటాయి. ఆ శరీరంతో వచ్చిన వాసనలు మరొక శరీరంలో ఉంటాయి. అంటే ఆ పూర్వ దేహంతో అనుభవించిన విషయాలన్నీ కంప్రేస్స్ (memory compression) చేసి మరొక శరీరంలోకి మోసుకుపోతాయి ఈ వాసనలు. అందుకే కొందరికి పుట్టుకతో తీపి ఇష్టం అవుతుంది, ఒకరికి పుట్టుకతో కోపం మెండుగా ఉంటుంది. ఈ వాసనలు చాలా బలీయమైనవి. వాటిని ప్రయత్నపూర్వకంగా మనం పోగొట్టుకోవాలి. అందుకు మంత్రజపమే సరైన సమాధానం అని పూజ్య గురువులు బోధిస్తుంటారు. ఒకరి తపస్సు తీవ్రతరమైనప్పుడు, ఈ జన్మ వాసనలు పోగొట్టుకుని, పూర్వ జన్మ విషయాల గదిని తెరచి ఆ వాసనలను పోగొట్టుకోగలుగుతారు (uncompress and clean). ఇది సద్గురు కృప ద్వారా సాధ్యమవుతుంది. ఇలా నేనెవరు అనే తీవ్రమైన తపస్సు చేసినవారికి ఈ సిద్ధులు కరతలామలకములు. అలా తమ పూర్వజన్మ విశేషాలన్నీ వారికి దృశ్యమానాలు అవుతాయి. చివరికి తమలో ఉన్న పరమాత్మను దర్శించుకుని, తమ చుట్టూ ఉన్న చైతన్య జగత్తు అంతా పరబ్రహ్మమే గోచరిస్తుంది వారికి. అటువంటి వారికి తమది మాత్రమె కాక అన్ని దేహాలజీవుల విషయాలు పూర్తిగా చూడగలరు. అటువంటి శక్తి తెలుసుకునే మార్గం కేవలం గురు,దైవ కృపవలన మాత్రమె సాధ్యం.
సనాతన ధర్మం ఏదీ అసాధ్యం అని చెప్పదు. అంతా నీలో ఉన్న పరబ్రహ్మ లోనే ఉన్నది, అది తెలుసుకో. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు మానవ జన్మ, విచక్షణా జ్ఞానం ఉంది అని నువ్వొక పరమాత్మ తురుపుముక్కవు అని ధైర్యం బోధిస్తుంది. తప్ప నువ్వు పాపంతో కుల్లిపోతున్నావు కాబట్టే మానవ జన్మ అని ఎక్కడా చెప్పదు. వివేకానందుల వారు చెప్పినట్టు మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నది కేవలం ధైర్యం
“ఉత్థిష్ఠ జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధార నిశితాదురాత్యయ “ – కధోపనిషత్ (Arise, Awake and Stop not until the goal is reached). మన మానవ జన్మ మనలోని దైవాన్ని అందుకోవడమే. అధైర్య పడక సత్సంగం ద్వారా మనం అందరం ఆ పరమ సత్యాన్ని తెలుసుకునేలా ఆశీర్వదించమని ఏడుకొండలవాడిని వేడుకుంటూ
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!
Share This :

Related Postsentiment_satisfied Emoticon