బొట్టు పెట్టడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో మీకు తెలుసా ?


మనం అందరము ప్రతి దినము బొట్టు పెట్టు కుంటాము. నిజానికి అది ఎందుకు పెట్టు కుంటున్నామో దాని వెనుక ఉన్న ఆంతర్యము ఏమిటో ఎవరికీ తెలియదు. అందులోను బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమనే ధరిస్తాము. అసలు కుంకుమనే ఎందుకు ధరించాలి అనేది కూడ ఎవరికీ తెలియదు. ఇంకో విషయం ఏమిటంటే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు, బొట్టును నాసికాగ్రము పైభాగాన అంటే రెండు కను బొమ్మల మధ్య (భ్రుకుటి) లోనే ఎందుకు పెట్టుకుంటామో కూడ చాల మందికి తెలియదు.వీటి గురించి తెలుపుతుంది.
మనం పెట్టుకొనే బొట్టుకు శాస్త్రీయ కారణాలు కూడా చాలానే వున్నాయి.  కాని వీటి అన్నిటికంటే మరీ ముఖ్యంగా ఇందులో ఉన్న వేద అర్థాన్ని మరియు దాని అంతర్యాన్ని తెలిసికోవలసిన బాధ్యత మన అందరి పైన వుంది.
మొదట బొట్టు పెట్టుకునేటప్పుడు మనం కొద్దిగా కుంకుమను తీసుకుంటాము. దానిని మనం పెట్టుకుంటాము. నువ్వు తీసుకున్న కుంకుమ ఎంతయో అంత పరిణామమే నువ్వు అంటే ఆత్మవు అని దాని అర్థము. (దీనినే కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి ఈ విధంగా చెప్తాడు. ‘అంతరాత్మ అయిన పురుషుడు బొటన వ్రేలంతవాడు సర్వదా ప్రాణుల హృదయాలలో నివసిస్తువుంటాడు’).
కుంకుమనే ఎందుకు ధరించాలి అంటే కుంకుమ ఎర్రని ఎరుపు రంగు. దీని అర్థము నీవు అంటే ఆత్మవు అయిన నీవు ఈ ఎర్రని ఎరుపే (దేదీప్యమానంగా వెలిగే దివ్య జ్యోతి) అని దానిలో ఉన్న నిగూఢ అంతరార్ధము.
బొట్టును నాసికాగ్రము పైభాగాన అంటే రెండు కను బొమ్మల మధ్య (భ్రుకుటి) లోనే ఎందుకు పెట్టుకుంటాము అంటే నీవు అయిన ఆత్మ నివాస స్థానము అదే అని అర్థము, అంటే మనకు అందరికి వెలుగుతున్న దివ్య జ్యోతి అక్కడ కొలువై వుంటుంది. దీనినే శ్రీ కృష్ణ భగవానుడు 6 వ అధ్యాయం ధ్యాన యోగం లో ఈ విధంగా చెప్తాడు. ‘అర్జునా! చిత్తెంద్రియవ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రతగల మనస్సుతో తన నాసికాగ్రభాగమునందే దృష్టిని నిలిపి మనస్సును ఆత్మయందు స్థిరమొనర్చి ధ్యానించి ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొనిన యెడల యోగి శరీరం ఉండగానే ముక్తుడవుతున్నాడు. ఇదే విషయాన్నీ వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా “ఏకాగ్రతతో మనస్సు నిలిపిన ఓంకారము వినిపించునురా, భ్రూమధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా. ఆ చిదానంద మూర్తిని దర్శించిన ముక్తి నీకు ప్రాప్తించునురా.” అని తెలిపినాడు.
మిత్రులారా ఇప్పుడు అందరికి అర్థము అయినదా మనం ప్రతి దినము కుంకుమను ఎందుకు ధరిస్తామో. మిత్రులారా మనం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే ప్రతి పనిలో ఒక అంతరార్ధము వుంటుంది. దానిని తెలుసుకొని ఆచరించండి. అన్ని ఆచరించండి కాని దానిలో అంతరార్ధాన్ని గ్రహించలేకపోతే మీరు మీ పిల్లలకు ఎలా తెలుపుతారు. ఈ విధంగా తెలుసుకోలేకపోతే వాళ్ళు కూడా మన మాదిరే కళ్ళు ఉన్న గుడ్దొల్ల మాదిరి దారి తెన్ను తెలియక వెళ్తుంటారు. కావున అందరూ సూక్ష్మమైన విషయాలను గ్రహించి తెలుసుకొని ఆచరించండి. మీ పిల్లలకు మంచి భవిష్యతును అంటే పరమపదాన్ని చేరే మార్గాన్ని తెలుపండి. ఆ విధంగా తెలిపి వారి జన్మ యొక్క అంతర్యాన్ని వివరించండి.

Share This :

Related Postsentiment_satisfied Emoticon