పత్రి పూజ వెనకున్నశాస్త్రీయ కారణం ఏమిటి?


వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. చెట్లు త్వరగా పెరుగుతాయి. అదే సమయంలో రోగాలు కూడా త్వరగా వ్యాపిస్తాయి. మన గణపతికి సమర్పించే ఏకవింశతి పత్రాలను (21 రకాల పత్రిని) ముట్టుకోవడం వేత, వాసన పీల్చడం చేత ఈ కాలంలో వచ్చే అనేకానేక వ్యాధులు నివారించబడుతాయి. ఎందుకంటే ఈ 21 రకాల పత్రికి ఎన్నో అధ్భుతమైన ఔషధ గుణాలున్నాయి. మన #గణపతి స్వామికి సమర్పించిన పత్రి యొక్క వాసన ఇల్లంతా వ్యాపించడం వలన, ఇంట్లో ఉన్న క్రిములను నశిస్తాయి.
9 రోజులపాటు వరసిద్ధి వినాయకుడికి పత్రిపూజ చేయాలని చెప్తారు. ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు ఆ గణపతి విగ్రహం వద్ద కూర్చుని భజనలు, నృత్యగీతాలతో గడుపుతాం కనుక, 9 రోజుల పాటు ఈ పత్రి నుంచి వచ్చే ఔషధ గుణాలు సమ్మిళ్ళితమైన వాయువు మన శరీరంలో రోగనిరోధక శక్తిని వృద్ధి చేసి, ఇంతకముందు చేరి ఉన్న రోగకారక క్రిములను నశింపజేసి, సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉంచుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది.
వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుండో వచ్చి బురద నీరు చెరువుల్లో చేరుతుంది. ఆ నీటిలో క్రిములుంటాయి. ఆ నీరు తాగడం చేత అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువ. అందుకే వినాయక ప్రతిమతో పాటు ఆ పత్రిని కూడా నీటిలొ వదిలితే, పత్రిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా నీటి శుద్ధి జరుగుతుంది. నీటిలో అసహజమైన రసాయనాలు కలిపి శుద్ధి చేసేకంటే, సహజమైన పద్దతిలో, ప్రకృతి ప్రసాదించిన ఓషధుల చేత నీటిని శుద్ధి చేయడం శ్రేయస్కరమని భావించారు మన పూర్వీకులు. అట్లాగే మనకు అవసరమైన నీటిని, భూమిని, గాలిని శుద్ధి చేసుకోవడమే ఈ పండుగలో ఉన్న రహస్యం. ఈ విధంగా ఒక ప్రాంతం, రాష్ట్రం, దేశమంతా చేయడం వలన అందరూ ఆరోగ్యంతో సంతొషంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన ప్రజలున్న దేశం మాత్రమే అభివృద్ధి చెందగలుగుతుంది. దానికి దోహదం చేస్తున్నది వినాయకచవితి. అందుకే వినాయకచవితి ఆయుర్వేద ఆరోగ్య పండుగ అంటారు ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి రాజారంజిత్ గారు.
ఏదైనా ఒక పండుగ, లేదా పూజ చేస్తున్నామంటే, అది మనకు మాత్రమే కాదు, మన సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మేలు చేయాలన్న తపన కలిగిన పరమ నిస్వార్ధపరులు మన ఋషులు. ప్రతి పనిలోనూ విశ్వమానవ కల్యాణం గురించి కాంక్షించిన మహాపురుషులైన ఋషుల వారసత్వం మనదని సగర్వంగా చెప్పుకుందాం. ధర్మాన్ని, దేశాన్ని, ప్రకృతిని కాపాడుకుందాం. భావితరాలకు అందిద్దాం.
Share This :

Related Postsentiment_satisfied Emoticon