విద్యార్థులు తెల్లవారుజామునే నిద్ర లేచి చదువుకోవాలని పెద్దలు చెబుతారువిద్యార్థులు తెల్లవారుజామునే నిద్ర లేచి చదువుకోవాలని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ పలువురు అభ్యాసకులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఉదయం పూట మనసు నిర్మలంగా ఉంటుంది. చదివే అంశం పూర్తిగా మనసుకు హత్తుకుంటుంది. సూర్యోదయానికి ముందు సమయాల్లో దేవతలు సంచరిస్తారంటాయి పురాణ గాథలు. అందువల్ల, ప్రాతఃకాలంలో మనసుపెట్టి చేసే పనులన్నింటినీ ప్రార్థనతో సమానంగా భావిస్తారు. అలా చేసేవాటికి మెరుగైన ఫలితాలు లభిస్తాయంటారు. ఆ కారణంగానే, సాధకులు బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యాన ప్రక్రియలు చేపడుతుంటారు.
దైనందిన జీవితంలో ఉదయానికి విశిష్టమైన స్థానం ఉంది. దాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. కొన్ని సందర్భాల్లో, ‘ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా’ అని వేచిచూసేవారూ ఎందరో కనిపిస్తుంటారు. రోజుకు ఉదయం, సాయంకాలం ఉన్నట్లే మనసుకూ సుఖదుఃఖాలు ఉంటాయి. మనసుకు రెండు దారులు ఉండటమే దానికి కారణం. అది సరైన మార్గంలో వెళితే, వెలుగు నిండుతుంది. అదే జ్ఞాన సముపార్జన. అలా కాకుండా, మనసు అపసవ్య దిశలో పయనిస్తే చీకటి మిగులుతుంది. అంటే, అజ్ఞానంలో కూరుకుపోవడం!
అంతటా వెలుగు పంచే సూర్యుడు, ఎప్పుడూ అదే చోట ఉంటాడు. అలా అని చీకటి, వెలుగులకు తాను కారణం కాదు. భూ పరిభ్రమణం వల్ల రాత్రింబగళ్లు ఏర్పడుతున్నాయి. సూర్యుడికి భూమి అభిముఖంగా తిరుగుతున్నప్పుడు వెలుతురు వస్తుంది. దానికి వ్యతిరేక దిశలో వెళితే, చీకటి కమ్ముకుంటుంది. అవిశ్రాంతంగా చలించే మనసుకూ అంతే! అది అనుక్షణం ఆత్మజ్యోతి వైపు ప్రణమిల్లి ఉండాలి. అందుకు భిన్నంగా హద్దూపద్దూ లేని ఆలోచనలతో మనసు బయట వూరేగడం దుఃఖహేతువు. అంతులేని కోరికలతో ఆకాశానికి ఎగరడం సరికాదు. ఉన్న జీవితాన్ని యథాతథంగా స్వీకరించేలా ధైర్యసాహసాలు చేయకపోవడం, నెరవేరని కోరికలు తెచ్చే నైరాశ్యం అంతులేనివి. అవన్నీ మనసును అనేక విధాలుగా అతలాకుతలం చేస్తాయి. ఆ దుఃఖసాగరం నుంచి బయటపడేందుకు మనిషి పలురకాలుగా ఆలోచిస్తాడు. ఎలాగైనా ఆనందం పొందడానికి ప్రయత్నిస్తాడు. విముక్తి కోసం పరితపిస్తాడు. అలా మెలమెల్లగా అతడిలో తిరుగు ప్రయాణం ఆరంభమవుతుంది.
‘జీవకోటిలో మనిషి మాత్రమే- బ్రహ్మానందం పొం దాలని, మోక్షప్రాప్తి కలగాలని కోరుకుంటాడు. మిగతా జీవులు కోరుకోవు. ఎందుకు’ అని ఒక శిష్యుడు గురువును అడిగాడు. ఆయన ఇలా బదులిచ్చాడు- ‘మానవేతర జీవులకు మనుగడకు కావాల్సినంత జ్ఞానమే ఉం టుంది. అవి ఆహారం దొరికితేనే ఆకలి తీర్చుకుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడతాయి. ప్రమాదాలు ఎదురైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి, అక్కడ గూళ్లు కట్టుకుంటాయి. ఆహారమూ సమకూర్చుకుంటాయి. వాటికీ అనుభవాలు, జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని జీవితావసరాలకే ఉపయోగిస్తాయి. ఇతర జీవులతో పోల్చుకోవు. గడచినవాటి గురించి దిగులు పడవు. రేపు ఏమవుతుందోనన్న భయమూ వాటికి ఉండదు. కాబట్టి, వాటికి మానసికంగా దుఃఖం కలిగే అవకాశం లేదు. ఆనందం తాలూకు అవసరమూ వాటికి రాదు. అవి ఉన్న స్థితే వాటికి ఆనందమైనా, ఆ విషయం మాత్రం వాటికి తెలియదు’. గురువు మాటల్లోని పరమార్థాన్ని శిష్యుడు అప్పుడు గ్రహించాడు.
దుఃఖం అనేది మనిషికి మానసికంగా కలిగేది. ఉపశమనం పొందడానికి, దుఃఖమూలాన్ని అతడు వెతికి పట్టుకోవాలి. అది దొరకడం అంటే, సంబంధిత సత్యం తెలియడం! అప్పుడే దుఃఖం తొలగిపోతుంది. సత్యం తెలియడం, దుఃఖం తొలగడం రెండూ వేర్వేరు ప్రక్రియలు కావు. ఆ రెండూ ఒకటే! అది ఉలితో చెక్కిన శిల శిల్పం కావడం వంటిది. శిలను ఉలితో తొలుస్తున్నప్పుడే, లోపలి శిల్పం బయటకు తొంగిచూడటం మొదలవుతుంది. అలాగే చీకటి వెళ్లిపోవడం, సూర్యుడు రావడం ఏకకాలంలో జరుగుతుంటాయి.
కళ్లు తెరిస్తే, బయటి వెలుగు కనిపిస్తుంది. కళ్లు మూస్తే లోపలి అఖండ వెలుగు అనుభూతిలోకి వస్తుంది. కనులు మూసి ధ్యానసాధన చేస్తుంటే, ‘ఆత్మజ్యోతి’ దర్శనమవుతుంది. అది ఉదయంలా మెల్లగా సమీపిస్తుంది.
Share This :

Related Postsentiment_satisfied Emoticon