అన్నదాన శివన్

“వండిన అన్నం అంతా ఒకచోట రాశిలా పోస్తే, తెల్లని హిమాలయా పర్వతాలలాగా కనిపిస్తోంది. సాంబారు గంగాళంలోకి ఏనుగు పడినా మనకు కనపడదు. మీనాక్షీ కళ్యాణం అప్పుడు హిమలాచల శివుడు గుండోదరుని ఆహారం కోసం పెద్ద గొయ్యి సృష్టించాడు అని చెబుతారు. అలాగే, యీ పేద బ్రాహ్మణుడు శివన్ అద్భుతమైన పెద్ద కార్యం చేశాడు”.

కంచి పరమాచార్య స్వామివారు, 'అన్నదాన శివన్’ గా పేరు ప్రఖ్యాతులు పొందిన తెప్పేరుమానల్లూర్ శ్రీ రామస్వామి అయ్యర్ జరిపిన అన్నదాన ఉత్సవాల విశేషాలను నెమరువేసుకుంటున్నారు. ఈ అన్నదాన సమారాధనలు కుంభకోణంలో మహామాఖం సందర్భంగా 1921 మరియు 1933లలో జరిగినప్పుడు కొన్ని వేలమంది అన్నం తిన్నారు.

పద్ధెనిమిదవ శతాబ్దం మధ్యనుండి పంతొమ్మిదవ శతాబ్దం మధ్యవరకూ కంచి మఠానికి కుంభకోణం ప్రధాన కార్యాలయం. 1916 నుండి 1939లో శరీరం విడిచేదాకా మఠాన్నే తన గృహంలా మార్చుకున్నాడు శివన్.

ఆ మహోత్సవాల గురించి పరమాచార్య స్వామివారు యిలా గుర్తు చేసుకున్నారు.

“అది 1933లో జరిగిన మాహామఖం అన్నదాన సమారాధన. వంట చెయ్యడం కోసం వంద ఎడ్లబండ్లలో వంటచెరుకు తెచ్చారు. పచ్చళ్ళ కోసం పది ఎడ్లబండ్ల ఉసిరికాయలు వచ్చాయి. వండుతున్నప్పుడు ఆ వంటల నుండి వస్తున్న వాసనచూసి వాటికి ఏమి తక్కువయ్యిందో చెప్పగలిగేవాడు. రసం నుండి వచ్చే వాసనను బట్టి యింకా ఎంత ధనియాలపొడి దంచి వెయ్యాలో చెప్పేవాడు. ఏదో పిడికెడు ధనియాలు కాదు, ‘పెద్ద తట్టలో ధనియాలు దంచి రసానికి వెయ్యండి’ అని ఒక వంటవానికి చెప్పాడు. ఇప్పటికే రసానికి వేసిన ధనియాల పొడి కాకుండా యుంత పెద్ద తట్టలో ధనియాల పొడి వెయ్యమని చెప్పాడంటే, అక్కడ తయారవుతున్న రసం పరిమాణం ఎంతో మనం ఊహించవచ్చు. భోజనాలు అయిన తరువాత ఊడ్చి శుభ్రం చెయ్యడానికి రెండు ఎడ్లబండ్ల చీపుళ్ళు ఉపయోగిస్తున్నారు.

అన్నం వండడానికి ఎంత పెద్ద పాత్రలున్నా, ఎంత పొడుగైన కట్టెల పొయ్యిలున్నా, కావాల్సినంత అన్నం వండడానికి అవి ఏమాత్రం సరిపోవు. కనుక అతను ఏమి చేసేవాడంటే, మొదట పది లేదా ఇరవై సంచుల అన్నాన్ని వండి, దాన్ని పొడవుగా పరచిన చాపలపై పోసి, పొగలు కక్కుతున్న ఆ అన్నంపై పలుచటి తెల్ల బట్ట కప్పి, దానిపై వండని బియ్యాన్ని పరచేవాడు. వండని బియ్యాన్ని పెద్ద గోనెసంచులతో కప్పి చాపలను గట్టిగా చుట్టేవాడు. అరగంట తరువాత ఆ సంచులను విప్పితే, పైన ఉన్న బియ్యం మొత్తం ఉడికి పువ్వులా తెల్లగా అన్నం అయ్యేది. అన్నం త్వరగా వండడానికి తను కనుగొన్న విధానం యిది.

అంతమందికి కావాల్సిన పెరుగు తయారుచేయడానికి ఉపయోగించే పాల కోసం ఎక్కడికి వెళ్ళేవాడు? దీనికోసం శివన్ దగ్గర మరొక ఉపాయం వుంది. అప్పట్లో యిప్పటిలా ఫ్రిజ్జులు లేని కాలంలో తనకోసం ఒకటి కనిపెట్టాడు శివన్. సమారాధనకు కొద్ది వారాలు లేదా నెలల ముందే పాలు సేకరించి పెరుగు తయారుచేసే ప్రక్రియకు ఉపక్రమిస్తాడు. ఆ పెరుగును చెక్క బానల్లో నింపి, మైనంతో వాటిని మూసి, లోతైన చెరువుల్లో వాటిని ముంచుతాడు. ఆ బానలను బయటకు తీసి వాటిని తెరిస్తే, అందులోని పెరుగు ముందురోజే తయారుచేసినంత తాజాగా వుండేది! అది కేవలం చెరువు యొక్క చల్లదనం వల్ల మాత్రమే కాదు, అతని మనస్సు యొక్క చల్లని కరుణ స్థితి వల్ల కూడా యిది సాధ్యం అని చెప్పవచ్చు”.

శివన్ ఈ సమారాధనలను కంచి మఠం తరుపున చేసినా, 1921 మరియు 1933లలో జరిగిన మహామాఖం అన్నసమారాధనలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే, అప్పుడు పరమాచార్య స్వామివారు కుంభకోణంలో లేని సమయం, 1919లో స్వామివారు సంకల్పించిన గంగాయాత్ర దాదాపు యిరవైఒక్క సంవత్సరాలు సాగింది. 1933 మాహామాఖం అప్పుడు స్వామివారు రామేశ్వర యాత్ర చేస్తూ కుంభకోణం దగ్గర్లోని పట్టీశ్వరం, తిరువిడైమరదూర్ లలో మకాం చేశారు. తరువాత రామేశ్వరం నుండి వారణాసి యాత్ర చేస్తారు. నియమం ప్రకారం యాత్ర ముగిసేదాకా కుంభకోణం మఠానికి పోలేదు స్వామివారు. స్వామివారు మకాం చేసిన స్థలం నుండి స్నానం కోసం మహామాఖం పుష్కరిణికీ, లేదా కుంభకోణంలోని దేవాలయాలకూ వెళ్ళి తిరిగొచ్చేవారు. 1933 వ సంవత్సరంలోనే శివన్ ఆధ్వర్యంలో మఠం జీర్ణోద్ధరణ పూర్తయ్యింది.

శివన్ చేసే అన్నదాన సమారాధనలలో ప్రత్యేకత ఏమిటంటే, ముందురోజు సాయంత్రం దాకా అన్నదానానికి సంబంధించిన పనులు జరుతున్నట్టు కనబడదు. అన్నదానికి కావాల్సిన సరుకులు రావడం కూడా రాత్రికే మొదలవుతుంది. 1933లో అర్ధరాత్రి దాటిపోయినా ఒక్క ఎడ్లబండిలో కూడా కావాల్సిన సరుకులు రాలేదు. భయం ఎరుగని శివన్ కూడా మరుసటిరోజు లక్షల మందికి చేయాల్సిన అన్నదానానికి సరిపడా వండడానికి వున్న సమయం గురించి ఆందోళనచెందడం మొదలుపెట్టాడు.

ఈ విషయం పరమాచార్య స్వామివారు బస చేస్తున్న చోటుకు చేరింది. కొద్ది సమయం తరువాత ఎడ్లబండ్లు రావడం మొదలయ్యాయి.

మహామాఖం అప్పుడుండే ట్రాఫిక్ నిబంధనలు శివన్ ఎడ్లబండ్లకు వర్తించవు అన్న విషయం తెలియని అధికారులు వాటిని ఆపేశారు. రాత్రి ఒంటిగంటన్నరప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు హఠాత్తుగా యీ విషయం గుర్తురావడంతో వెంటనే బండ్లున్న ప్రదేశానికి బయలుదేరాడు. దాంతో ఊరిబయటే ఆగిపోయిన ఎడ్లబండ్లు లోపలకు అనుమతించబడి, పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో యిక అక్కడినుండి అంతా సవ్యంగా
జరిగిపోయింది.

ఈ అన్నసమారాధనల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ‘నడిచే శివన్’ కానీ, 'అన్నదాన శివన్’ కానీ వండిన వంటలో ఒక్క మెతుకు కూడా ముట్టుకోరు. సాధారణంగా పరమాచార్య స్వామివారు ఉపవసించకుంటే శ్రీ చంద్రమౌళీశ్వరునికి నివేదించిన అటుకులను తీసుకుంటారు. అన్నదాన శివన్ తన స్నేహితుని యింటికి వెళ్ళి తనకు ఎంతగానో యిష్టమైన పెరుగన్నం తీసుకుంటాడు. ప్రతిరోజూ తన ఇష్టదైవమైన శ్రీ దక్షిణామూర్తికి నివేదించి తీసుకునేది ఆ పెరుగన్నం మాత్రమే.

తరువాత పరమాచార్య స్వామివారు చెప్పిన విషయం ఏమిటంటే, అందరూ అనుకున్నట్టు యీ అన్నసమారాధనలను శివన్, కంచి మఠం తరుపున జరిపాడని అనడంకంటే, శివన్ జరిపిన యీ సమారాధనల వల్లే అప్పట్లో ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మఠం కాస్త కుదుటపడింది.

--- *రా. గణపతి, 'మహా పెరియవాళ్ విరుంధు' నుండి*

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Share This :

Related Postsentiment_satisfied Emoticon